Telugu Global
Telangana

సీతక్క ఎలక్షన్ కు కర్నాటక, చత్తీస్ ఘడ్ నుంచి డబ్బులు

డబ్బులు తెచ్చి పంచి పెడుతున్న పార్టీ కాంగ్రెస్ అని, అయితే ప్రతిగా తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు.

సీతక్క ఎలక్షన్ కు కర్నాటక, చత్తీస్ ఘడ్ నుంచి డబ్బులు
X

ములుగు ఎన్నికల ప్రచారం ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కింది. తనను ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు ఓటుకు 5వేల రూపాయలు పంచి పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క. ఆమెకు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగజ్యోతి ప్రభంజనం తట్టుకోలేక సీతక్క ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి. ప్రజలు నాగజ్యోతికి బ్రహ్మరథం పడుతున్నారని, ఆమెకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క ఓర్వలేకపోతున్నారని చెప్పారు.

ఓటమి భయంతో కాంగ్రెస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతి స్థానంలో కాంగ్రెస్‌ ను ఓడగొట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. సీతక్క వద్ద రేవంత్‌ రెడ్డి ఇచ్చిన రూ.50 కోట్లు, కర్నాటక, ఛత్తీస్‌ ఘఢ్‌ నుంచి తెచ్చిన వందల కోట్లు సిద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికే రూ.50 కోట్లు ములుగుకు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎన్నికల్లో ధనబలంతో గెలవాలని సీతక్క అనుకుంటున్నారని మండిపడ్డారు.

డబ్బులు తెచ్చి పంచి పెడుతున్న పార్టీ కాంగ్రెస్ అని, అయితే ప్రతిగా తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు. సీతక్క ఆరోపణలపై ఎన్నికల కమిషన్‌, ఎక్సైజ్‌ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలోనే ములుగు అభివృద్ధి జరిగిందని, ములుగుని జిల్లా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ, సీతక్క కాదని చెప్పారు. తాము చేసిన పని చెప్పి ఓట్లు అడుగుతున్నామని అన్నారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  14 Nov 2023 1:54 PM IST
Next Story