Telugu Global
Telangana

సముద్రం లాంటి మల్లన్నసాగర్‌ ను చూసి కడుపునిండింది

కాళేశ్వరం మునిగిపోయిందనేటోళ్లకు ఇది చెంప పెట్టు.. మాజీ మంత్రి హరీశ్‌ రావు

సముద్రం లాంటి మల్లన్నసాగర్‌ ను చూసి కడుపునిండింది
X

సముద్రం లాంటి మల్లన్నసాగర్‌ ను చూసి కడుపునిండిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ ను సందర్శించి గోదావరి జలాలకు పూజలు చేశారు. అంతకుముందు మల్లన్నసాగర్‌ సందర్శనకు వెళ్తోన్న మాజీ మంత్రులు హరీశ్‌ రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ను వర్షంలోనే హరీశ్‌ రావు, ఇతర నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ, కేసీఆర్‌ నిర్మించిన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ ఈరోజు 21 టీఎంసీల నీళ్లతో సముద్రంలాగా కనిపిస్తోందని.. ఈ దృశ్యాన్ని చూసి కడుపునిండినంత సంతోషం కలుగుతోందన్నారు. కాళేశ్వరం కొట్టుకుపోయింది.. మునిగిపోయింది అనేటోళ్లకు చెంపపెట్టులాంటి సమాధానం మల్లన్నసాగర్‌ అన్నారు. రూ.లక్ష కోట్లు వృథా అయిందని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులకు గలగల పారుతున్న గోదావరి నీళ్లే సమాధానం చెప్తున్నాయన్నారు. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్నసాగర్‌ లోకి 21 టీఎంసీలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. నిండుకుండలా ఉన్న మల్లన్నసాగర్‌ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు.

కాళేశ్వరం కింద పండే ప్రతి పంటలో కేసీఆర్‌ పేరు ఉందని, ప్రతి రైతు గుండెల్లో కేసీఆర్‌ పేరు నిలబడి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఇకనైనా మూర్ఖపు ప్రచారం మానుకోవాలన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్‌ లో మూడు టీఎంసీలు, రంగనాయకసాగర్‌ లో మూడు టీఎంసీలు, మల్లన్న సాగర్‌ లో 21 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌ లో 10 టీఎంసీలు నిల్వ చేసుకున్నామంటే అది కేసీఆర్‌ కృషితోనే సాధ్‌యమైందన్నారు. అయినా కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని తెలిపారు. వాళ్లవి డైవర్షన్‌ పాలిటిక్స్‌ అయితే.. తమది రైతులకు నీళ్లు ఇయ్యాలే అనే తపన అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు మల్లన్నసాగర్‌ లో ఇంత పసుపు కుంకుమ వేసి వాళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. కాళేశ్వరం నీళ్లతో మెదక్‌, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లో పంటలు పండటం కాంగ్రెస్‌ నాయకులకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఈ రిజర్వాయర్‌ కింద కాల్వలు, ఇతర పనులు 90 శాతం పూర్తయ్యాయని, పది శాతం పెండింగ్‌ లో ఉన్న పిల్ల కాల్వల తవ్వకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. రాబోయే యాసంగిలో మూడు, నాలుగు జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయని అన్నారు. రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్‌ కు నీళ్లు తీస్కపోతా, మూసీకి నీళ్లు తీసుకుపోతా అంటున్నాడని.. దానికి కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరమే దిక్కు అయ్యిందని అన్నారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరంపై విష ప్రచారం చేశారని, రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. గతేడాది ఆగస్టు నెలలోనే చెరువుల్లో చేప పిల్లలు వేశామని.. ఈసారి సెప్టెంబర్‌ నెలాఖరుకు వచ్చినా చేప పిల్లలు పంపిణీ చేయడం లేదన్నారు. కాలం కాకపోయిన ప్రాజెక్టుల నీళ్లతో చెరువులు నింపుకునే సౌకర్యం కేసీఆర్‌ కల్పించారని.. ప్రభుత్వం ఎప్పటిలోగా చేపపిల్లలు పంపిణీ చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

First Published:  20 Sept 2024 6:36 PM IST
Next Story