Telugu Global
Telangana

కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికలకు గెజిట్ విడుదల.. పరోక్ష పద్దతిలోనే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పార్లమెంటులో కంటోన్మెంట్ బిల్ - 2022ను ప్రవేశపెట్టాలని భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ బిల్ పార్లమెంటు ముందుకు రాలేదు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందినట్లయితే.. వైస్-ప్రెసిడెంట్ పోస్టును నేరుగా ప్రజలే ఎన్నుకునే వీలుండేది.

కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికలకు గెజిట్ విడుదల.. పరోక్ష పద్దతిలోనే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక
X

సికింద్రాబాద్ సహా దేశంలోని పలు కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికలు నిర్వహించడానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రంగం సిద్దం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) సహా మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించాలని శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, ఓట్ల లెక్కింపుకు సంబంధించిన వివరాలను ఒకటి రెండు రోజుల్లో రక్షణ శాఖ విడుదల చేయనున్నది. ఈ సారి ఎస్సీబీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరపాలని పలు రాజకీయ పార్టీలు రక్షణ శాఖను కోరినా.. ఎప్పటి లాగే ఫ్రీ సింబల్స్‌తో ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

ఎస్సీబీకి చివరి సారిగా 2015లో ఎన్నికలు జరిగాయి. 2020లో బోర్డు పాలకవర్గం గడువు తీరిపోవడంతో ఏడాది పాటు పొడిగింపు లభించింది. పలు కారణాల వల్ల గత రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించడం కుదరలేదు. దీంతో ఎట్టకేలకు ఎస్సీబీలోని ఎనిమిది వార్డులకు త్వరలో ఎన్నికలు జరపడానికి డిఫెన్స్ మినిస్ట్రీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఎనిమిది వార్డుల్లో గెలిచిన సభ్యుల నుంచి ఒకరిని ఎస్సీబీ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటారు,.

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నిర్దేశించిన ఫ్రీ సింబల్స్‌నే ఎస్సీబీ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించనున్నారు. పేరుకు పార్టీల రహితంగా ఈ ఎన్నికలు జరిగినా.. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల హవా ఇక్కడ నడుస్తోంది. తమ అభ్యర్థులనే బోర్డు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నాయి. కాగా, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక సమయంలో గెలిచిన 8 మందితో పాటు ఎక్స్-అఫిషియో మెంబర్లకు కూడా ఓటు హక్కు ఉంటుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఈ ఎన్నికలో ఎక్స్-అఫిషియో మెంబర్ హోదాను కలిగి ఉంటారు. అయితే ఆదివారం ఎమ్మెల్యే సాయన్న మరణించడంతో ఆ మేరకు ఒక ఓటు కోత పడనున్నది.

వాస్తవానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పార్లమెంటులో కంటోన్మెంట్ బిల్ - 2022ను ప్రవేశపెట్టాలని భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ బిల్ పార్లమెంటు ముందుకు రాలేదు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందినట్లయితే.. వైస్-ప్రెసిడెంట్ పోస్టును నేరుగా ప్రజలే ఎన్నుకునే వీలుండేది. ప్రస్తుతానికి బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి ఈ సారి కూడా పరోక్ష పద్దతిలోనే ఉపాధ్యక్ష ఎన్నిక జరుగనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గత ఐదు దశాబ్దాలుగా ఎస్సీబీ బోర్డుకు ఎలా ఎన్నికలు జరుగుతున్నాయో.. అదే విధంగా ఈ సారి కూడా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని 1, 3, 4, 7 వార్డులు జనరల్ అభ్యర్థులకు.. 2, 5, 6 వార్డులు మహిళలకు, 8వ వార్డు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీబీతో పాటు దేశంలోని 58 బోర్డులకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని ఖ్యాసోల్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన గెజిట్ ఉత్తర్వులను ఫ్రీజ్ చేశారు.

First Published:  19 Feb 2023 11:37 AM GMT
Next Story