Telugu Global
Telangana

రేపు రెండో విడత రుణమాఫీ.. అర్హులందరికీ న్యాయం జరిగేనా..?

తొలి విడత రుణమాఫీ సందర్భంగా కాంగ్రెస్ నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. రెండో విడత రుణమాఫీ ప్రక్రియను కూడా పెద్దఎత్తున ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.

రేపు రెండో విడత రుణమాఫీ.. అర్హులందరికీ న్యాయం జరిగేనా..?
X

తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీకి రంగం సిద్ధమైంది. మంగళవారం రెండో విడత రుణమాఫీ నిధులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆగస్ట్ 15లోగా మొత్తం రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణలో ఈనెల 19న తొలి విడత రైతు రుణమాఫీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్నవారికి లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వం రుణమాఫీ మొదలు పెట్టింది. అయితే చాలామంది అర్హులకు ఆర్థిక సాయం అందలేదు. దీంతో గందరగోళం నెలకొంది. రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకుని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులకు నేతలు ఆదేశాలిచ్చారు. ఈలోగా రెండో విడతకు వారు సన్నాహాలు చేయడం విశేషం. లక్షన్నర రూపాయల లోపు రుణం తీసుకున్నవారికి రెండో విడతలో భాగంగా రుణమాఫీ చేస్తారు.

రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది. రైతుబంధు నిధులు వేయకుండా.. వాటిని రుణమాఫీకి మల్లించారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఈ విమర్శలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తొలి విడత సందర్భంగా కాంగ్రెస్ నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. రెండో విడత రుణమాఫీ ప్రక్రియను కూడా పెద్దఎత్తున ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.

First Published:  29 July 2024 8:51 PM IST
Next Story