Telugu Global
Telangana

తెలంగాణలో డ్రాపౌట్స్ తక్కువ.. ఆ ఘనత ఎలా సాధ్యమైందంటే..?

తెలంగాణలో కూడా డ్రాపౌట్స్ ఉన్నారు కానీ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాదికేడాది ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలే దీనికి కారణం.

తెలంగాణలో డ్రాపౌట్స్ తక్కువ.. ఆ ఘనత ఎలా సాధ్యమైందంటే..?
X

బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి, పనిలో కాదు.. అనేది ప్రభుత్వాల సంకల్పం. తెలంగాణ ప్రభుత్వం ఈ సంకల్పాన్ని కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించింది. తెలంగాణలో అమలవుతున్న పథకాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. దేశంలో అత్యంత తక్కువ స్థాయిలో డ్రాపౌట్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచింది. తాజాగా ఉచిత అల్పాహార పథకంతో ఈ డ్రాపౌట్స్ మరింత తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.

ఏ రాష్ట్రంలో ఎలా..?

మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 23.8 శాతం మంది డ్రాపౌట్స్ ఉన్నారు. మేఘాలయలో అది 21.7 శాతంగా ఉంది. బీహార్ లో 20.46 శాతం మంది, అసోంలో 20.3 శాతం మంది పిల్లలు ఏటా బడి మానేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో డ్రాపౌట్స్ 16.7 శాతం మంది. తెలంగాణలో బడిమానేస్తున్న పిల్లల శాతం 13.7

డ్రాపౌట్స్ ఉన్నారు కానీ..

తెలంగాణలో కూడా డ్రాపౌట్స్ ఉన్నారు కానీ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాదికేడాది ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలే దీనికి కారణం. సహజంగా పల్లెటూళ్లలో యుక్తవయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలను బడిమాన్పించేస్తుంటారు తల్లిదండ్రులు. నెలసరి సమయంలో బడికి సెలవు పెట్టాల్సి రావడంతో.. కొన్నిసార్లు ఆ సెలవలు అలానే కొనసాగుతాయి. కానీ ఇలాంటి సున్నిత సమస్యను కూడా పరిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. 8వతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 30లక్షలమంది పిల్లలకు ప్రతి నెలా శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందిస్తోంది. దీనికోసం 70కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అందుకే అమ్మాయిలు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూళ్లకు వస్తున్నారు. డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు ఉచిత బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం పూట ఉచితంగా విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తుంది ప్రభుత్వం. ప్రతి రోజూ పౌష్టికాహారం అందేలా మెనూ కూడా సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా డ్రాపౌట్స్ సంఖ్య మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఉదయాన్నే కూలి పనులకు వెళ్లే నిరుపేదలు.. పిల్లలకు టిఫిన్ రెడీ చేసి, వారిని స్కూల్ కి పంపించే వెసులుబాటు ఉండదు. అలాంటి సందర్భాల్లో పిల్లలు సరిగా స్కూల్ కి రారు, వచ్చినా పౌష్టికాహార లోపం వల్ల వారు సరిగా చదువుకోలేరు. ఈ రెండు సమస్య ల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచిత బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తెరపైకి తెచ్చింది. దీని ద్వారా బడి మానేసే పిల్లల సంఖ్య మరింతగా తగ్గుతుంది, అదే సమయంలో పిల్లలకు మంచి పౌష్టికాహారం కూడా అందుతుంది.

First Published:  6 Oct 2023 10:10 PM IST
Next Story