Telugu Global
Telangana

పుస్తకాలు అవే, కానీ స్కూల్ బ్యాగ్ తేలిక.. ఎలాగంటే..?

ఈ తగ్గింపు వల్ల విద్యార్థులపై భారం తగ్గడమే కాదు, ప్రభుత్వానికి కూడా పాఠ్యపుస్తకాలపై చేయాల్సిన ఖర్చులో రూ.30 నుంచి రూ.40 కోట్లు మిగులుతుండటం విశేషం.

పుస్తకాలు అవే, కానీ స్కూల్ బ్యాగ్ తేలిక.. ఎలాగంటే..?
X

పసి పిల్లలు తమ స్థాయికి మించి బరువున్న స్కూల్ బ్యాగ్ లను మోయడం అందరం చూస్తూనే ఉంటాం. వారి శారీరక ఆరోగ్యానికి అది మంచిది కాదని తెలిసినా కూడా పేరెంట్స్ ఏమీ చేయలేని పరిస్థితి. భవిష్యత్ బాగుంటాలంటే.. ఆమాత్రం బరువులు మోయక తప్పదని భావించి సరిపెట్టుకుంటారు. పోనీ స్కూళ్ల తరపున ఏమైనా ప్రయత్నం చేయొచ్చు కదా అంటే అది మొదటికే మోసం. ఎన్ని ఎక్కువ పుస్తకాలిస్తే అంత మంచి స్కూల్, అంత పెద్ద స్కూల్. ప్రైవేటు వ్యవహారం అలాగే ఉంటుంది. ఇటీవల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు కూడా సెమిస్టర్ల పేరుతో పుస్తకాల మోత పెరిగింది. దీన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రయత్నం మొదలు పెట్టింది. స్కూల్ బ్యాగ్ బరువు దాదాపు 30శాతం తగ్గించేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది.

పుస్తకాల సంఖ్య తగ్గకండా స్కూల్ బ్యాగ్ బరువు తగ్గాలంటే, విడివిడిగా పుస్తకాల బరువు తగ్గాల్సిందే. పుస్తకం బరువు తగ్గాలంటే పేపర్ బరువు తగ్గాలి, పరోక్షంగా దాని మందం తగ్గిస్తే పేపర్ బరువు తగ్గుతుంది, పుస్తకం తేలిక అవుతుంది. ఈ సూత్రం ఆధారంగానే పేపర్ మందం తగ్గించి పుస్తకాలు ముద్రించబోతున్నారు. ప్రస్తుతం 90 GMS (గ్రామ్స్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) మందం ఉన్న పేపర్ ని పాఠ్యపుస్తకాల ముద్రణకు ఉపయోగిస్తుండగా.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 70 GMS మందం ఉన్న పేపర్‌ ను ఉపయోగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పుస్తకాలు తేలికగా, సన్నగా మారుతాయి. కవర్ పేజీ మందం కూడా 250 GMS నుంచి 200 GMS కు తగ్గిస్తున్నారు. ఈ తగ్గింపు వల్ల విద్యార్థులపై భారం తగ్గడమే కాదు, ప్రభుత్వానికి కూడా పాఠ్యపుస్తకాలపై చేయాల్సిన ఖర్చులో రూ.30 నుంచి రూ.40 కోట్లు మిగులుతుండటం విశేషం.

నోట్ బుక్స్ మందం ఇప్పటికే తగ్గిపోయింది కానీ వాటి సంఖ్య పెరగడం వల్లే ఇబ్బంది వస్తోంది. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ తేలికవుతున్నాయి. మరి ప్రైవేట్ స్కూల్స్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. కొన్ని స్కూల్స్ లో బడిలో ఒక బ్యాగ్, బడికి వస్తూ ఒక బ్యాగ్ అనే పద్ధతి అమలవుతోంది. పిల్లలపై అలా సగం భారం తగ్గిందనమాట. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పిల్లల బడి బ్యాగ్ మరింత తేలికగా మారే అవకాశముంది.

First Published:  26 Feb 2024 9:14 AM IST
Next Story