MLC ఎన్నికలకు షెడ్యూల్.. ఏ పార్టీ గెలవనుందంటే..!
29న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 1న ఫలితాలు ప్రకటించనున్నారు.
తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించనుంది.
ఇక ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది. 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల విత్‌డ్రాకు గడువు ఉంటుంది. 29న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 1న ఫలితాలు ప్రకటించనున్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి 2021 నవంబర్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. రెండేళ్లపాటు ఎమ్మెల్సీగా కొనసాగారు. దీంతో ఈసారి గెలిచే అభ్యర్థులు నాలుగేళ్ల పాటు మాత్రమే ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 65 మంది సభ్యుల బలం ఉండగా.. బీఆర్ఎస్‌కు 39 మంది, దాని మిత్రపక్షం MIMకు ఏడుగురు సభ్యులు ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో సీటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.