తెలంగాణలో భయపెడుతున్న వైరల్ ఫివర్లు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
వర్షాకాలం వల్ల దోమలు ఎక్కువగా ఇండ్లలోకి ప్రవేశిస్తున్నాయని.. దోమ కాటు కూడా పెరిగి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో జ్వరాలు, జలుబు, దగ్గు వంటి రోగాలతో బాధపడే వారు కూడా పెరుగుతున్నారు. ఏ ఇంట్లో చూసిన వైరల్ ఫివర్ లేదా దగ్గు, జలుబుతో ఉన్న వాళ్లు కనిపిస్తున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు కారణంగానే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు రావడం సాధారణమే అయినా.. ఈ సారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రతీ రోజు ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వారిలో ఎక్కువగా వైరల్ ఫివర్ లక్షణాలతో ఉన్న వారే అధికంగా ఉన్నారు.
వర్షాకాలం వల్ల దోమలు ఎక్కువగా ఇండ్లలోకి ప్రవేశిస్తున్నాయని.. దోమ కాటు కూడా పెరిగి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. దోమ కాటు కారణంగానే వైరల్ ఫివర్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతీ 10 మందిలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నది. వైరల్ ఫివర్ ఓపీలు రాష్ట్రంలో భారీగా పెరిగినట్లు చెప్పింది.
డెంగీ, మలేరియా లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. డెంగీ, మలేరియా లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వాళ్లు ఎక్కువగానే ఉన్నా.. ఎవరిలోనూ ప్రమాదకర స్థాయిలో లేవని వైద్యారోగ్య శాఖ చెప్పింది. టైఫాయిడ్ కూడా కనిపిస్తోందని.. వారికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ ఆసుపత్రులు భారీగా ఫీజులు వసూలు చేయవద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో వైరల్ ఫివర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఏఎన్ఎంలను అప్రమత్తం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి జ్వర పీడితులను గుర్తించి వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది.
హైదరాబాద్ నగరంలో కూడా వైరల్ ఫివర్లు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజులుగా నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల గణాంకాలు పరిశీలిస్తే.. ప్రతీ నలుగురిలో ఒకరు వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. జ్వరంతో పాటు దగ్గ, శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫివర్ ఆసుపత్రుల ఓపీలకు రోజూ 500 మంది విషజ్వరాల పేషెంట్లు వస్తున్నారు.
రాబోయే రోజుల్లో విష జ్వరాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. ప్రజలు భయాందోళనలు చెందవద్దని, జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో వైద్య తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లను అప్రమత్తం చేశామని చెప్పారు. దోమల నివారణకు గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు.