Telugu Global
Telangana

దళితబంధుపై కీలక నిర్ణయం..!

కేసీఆర్ హయంలో మొదటి విడతలో 38,323 కుటుంబాలకు దళితబంధు యూనిట్లు మంజూరు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున సాయం చేశారు.

దళితబంధుపై కీలక నిర్ణయం..!
X

దళితబంధుపై ఎస్సీ సంక్షేమశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడతలో స్వీక‌రించిన దరఖాస్తుల పరిశీలనను నిలిపేసింది. దాదాపు 50వేల దరఖాస్తులపై విధానపరమైన స్పష్టత వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయం తీసుకుంది. యూనిట్లు మంజూరై, కొంత నగదు విడుదలైన వారికి మిగతా సాయం అందించాలా..?, లేదా..? అన్న‌ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమశాఖ లేఖ రాసింది. దీనిపై రేవంత్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ హయంలో మొదటి విడతలో 38,323 కుటుంబాలకు దళితబంధు యూనిట్లు మంజూరు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున సాయం చేశారు. ఇందుకోసం రూ.4,441 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడతలో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున దాదాపు లక్షా 30వేల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అన్ని నియోజకవర్గాల్లో కలిపి జిల్లా కలెక్టర్లకు 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరి వివరాలను అధికారులు దళితబంధు పోర్టల్‌లో అప్‌లోడ్ కూడా చేశారు. రెండో విడతలో పైలట్ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని 162 మంది లబ్ధిదారులకు కొంతమేర నిధులు మంజూరయ్యాయి. ఇతర జిల్లాల్లో మరో 238 మంది లబ్ధిపొందారు. వీరికి తొలివిడత నిధులు అందాయి. మిగతా నిధులు రావాల్సి ఉంది.

అధికార పార్టీ నేతలకే దళితబంధు ఇస్తున్నారని కాంగ్రెస్ ఎప్పటినుంచో విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ సంక్షేమశాఖ నిర్ణయంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. రేవంత్ సర్కారు దళితబంధు పథకాన్ని కొనసాగిస్తుందా..? లేదా..?. కొత్త నిబంధనలు తీసుకొచ్చి, పథకం పేరు మారుస్తుందా?. లేక పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తారా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  21 Dec 2023 10:58 AM IST
Next Story