బీజేపీ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి... న్యాయ వ్యవస్థకు కేసీఆర్ విఙప్తి
నలుగురు టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ ఎత్తుగడలను కేసీఆర్ ఈ రోజు మీడియా సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు మాట్లాడిన మాటల వీడియోలను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు.
''ఈ దేశంలో ప్రజా ప్రతినిధులను అడ్డగోలుగా కొంటున్నారు. రాజ్యాంగ అతీత శక్తులు బీజేపీ కోసం కుట్రలు చేస్తున్నాయి. చట్టవిరుద్ద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలను చట్ట విరుద్దంగా కూల్చేస్తున్నారు. న్యాయ వ్యవస్థకు నేను విఙప్తి చేస్తున్నాను, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం రాత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
నలుగురు టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ ఎత్తుగడలను ఆయన మీడియా సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు మాట్లాడిన మాటల వీడియోలను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.... ''ఈ రోజు మీడియా సమావేశం చాలా భారమైన మనసుతో దుఖంతో నిర్వహిస్తున్నాను. ఈ దేశంలో దుర్మార్గం జరుగుతోంది. నిర్లజ్జగా విశృంఖలంగా, విచ్చలవిడిగా కొనసాగుతోన్న ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది. ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైరవిహారం ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం.'' అని అన్నారు.
ప్రభుత్వాలను కూలదోయడానికి మఠాధిపతులు, పీఠాధిపతుల రూపాల్లో తిరుగుతున్నారని, వీరంతా ప్రభుత్వాలను కూల్చడం కోసం అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన కేసీఆర్ వీళ్లకు ఫేక్ ఐడీ కార్డులు ఎవరిచ్చారు? ఒక్కొక్కరికి మూడు ఆధార్ కార్డులు, రెండు మూడు ప్యాన్ కార్డులు, మూడు మూడు డ్రైవింగ్ లైసెన్సులు ఎలా వచ్చాయి ? అని ప్రశ్నించారు. ఇదొక్క సాధారణ కేసులా చూడవద్దని న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నానని కేసీఆర్ తెలిపారు.
నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన నిందితులకు సంబంధించిన వీడియోల గురించి కేసీఆర్ మాట్లాడుతూ... ఈ వీడియోలను రోజు మునుగోడు పోలింగ్ ముగిశాకనే ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో వెయిట్ చేశాను.ముందే చేస్తే మునుగోడు ఎన్నికల్లో గెలవడం కోసమే చేశాననే ప్రచారం చేస్తారు. మునుగోడులో కూడా వెకిలి ప్రయత్నాలు చేశారు. పాల్వాయి స్రవంతి తనను కలిసినట్టు, కొన్ని టీవీల పేర్లు పెట్టి ప్రచారం చేశారు. ఎలక్షన్లు వస్తాయి, పోతాయి. గెలుస్తం, ఓడిపోతం. ప్రజల తీర్పును గౌరవించాలి. మేం గెలిస్తేనే లెక్క అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటది. వాళ్ళు ఓటమి అంచుకు చేరేసరికి ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. వారిని గెలిపిస్తే ఎలక్షన్ కమిషన్ మంచిది. ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అంటరు.'' అని కేసీఆర్ మండిపడ్డారు.
ఆ ముఠా మాట్లాడిన వీడియోలను సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ సహా సుప్రీం కోర్టు జడ్జిలకు, అన్ని రాష్ట్రాల హైకోర్టు జడ్జిలకు, దేశంలో అన్ని మీడియా సంస్థలకు, దేశంలోని అన్ని పార్టీలకు పంపుతున్నానని కేసీఆర్ చెప్పారు.
బీజేపీ దిగజారి ప్రవర్తిస్తోంది.ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన లెజిస్లేచర్, కార్యనిర్వహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియాలను పక్కన పెట్టేశారు. ఎవరినైనా బెదిరించగలం, ఏమైనా చేయగలం అని అనుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. ఈ రాజ్యాంగేతర ముఠాలు ఎవరు కూడా ఊహించని పనులు చేస్తున్నాయి ఈడీ, ఐటీ, తమ చేతుల్లో ఉన్నాయని చెప్పిన నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి అవసరమనుకుంటే వై కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చాడని, అలాగే కర్నాటక, మహారాష్ట్రల్లో తాము ప్రభుత్వాలను ఎలా కూల్చేశామో వివరంగా చెప్పారని, తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని బీజీపీయేతర ప్రభుత్వాలను కూల్చివేస్తామని, ఇప్పటికే 8 రాష్ట్ర ప్రభుత్వాలను తామే కూల్చివేశామని చెప్పారని కేసీఆర్ వివరించారు.
''ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలివ్వడం తమకు పెద్ద విషయమే కాదని రామచంద్ర భారతి చెప్పాడు, ఆయనతో ఫోన్ లో మాట్లాడిన తుషార్ అనే బీజేపీ నాయకుడు హోం మంత్రి మైత్ షాకు చాలా దగ్గరివాడు. కేరళలో రాహుల్ గాంధీ మీద బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఈ కథంతా నడిపిస్తున్నాడు. రామచంద్ర భారతి చెప్పిన ప్రకారం మొత్తం 24 మందితో ఈ ముఠా పనిచేస్తుందట. దేశంలో ఎక్కడైనా, ఎవ్వరినైనా కొనగలరట. ఈ దేశాన్ని బీజేపీ ఏం చేయాలనుకుంటోంది? న్యాయవ్యవస్థ, జర్నలిస్టులు, మేదావులు ఈ దేశాన్ని రక్షించాలి'' అని కేసీఆర్ అన్నారు.