ఉంగరం వెతికిపెట్టిన పోలీస్ టీమ్ కి సోషల్ మీడియాలో అక్షింతలు..
సామాన్యులు ఫోన్ చేస్తే విసుక్కునే పోలీసులు ఓ రాజకీయ నాయకుడికి ఇంత విలువ ఇస్తారా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఒక ఉంగరం కోసం డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో సహా పొలాల్లోకి వెళ్లిపోతారా అని ప్రశ్నించారు.
దొంగతనం జరిగిందని సామాన్యులెవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. హడావిడిగా కేసు నమోదు చేసి వెదికిపెట్టే పని మొదలు పెడతారని, లేదా దొంగల్ని పట్టుకోడానికి పోలీసులు పరుగులు పెడతారని అనుకోలేం. అలాగని అందరు పోలీసులు అంత నిర్లక్ష్యంగా ఉంటారని కూడా చెప్పలేం. కానీ ఇక్కడ బాధితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు కాస్త అత్యుత్సాహం చూపించారు. చివరకు ఉంగరం దొరికినందుకు సదరు మాజీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపినా, సోషల్ మీడియాలో మాత్రం అక్షింతలు పడ్డాయి. రాజకీయ నాయకుడి ఉంగరానికి అంత ప్రాధాన్యత ఇచ్చే పోలీసులు సామాన్యుల విలువైన వస్తువుల దొంగతనం కేసుల్ని ఎందుకు పెండింగ్ పెడుతుంటారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.
అసలేం జరిగింది..?
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పత్తి కూలీలను ఎన్నికల డబ్బులు ముట్టాయా అంటూ ప్రశ్నించి సోషల్ మీడియాలో పరువు పోగొట్టుకున్న బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తాజాగా మరోసారి అలాంటి పనే చేశారు. ఇటీవల ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కోస్తుండగా వేలికి ఉన్న నవరత్నాల ఉంగరం పోయింది. దాన్ని వెదకాలంటే పెద్ద పని, అందుకే ఆయన వెంటనే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెటల్ డిటెక్టర్ తీసుకుని రావాలని, తన ఉంగరం పోయిందని కోరారు. సహజంగా ఇలాంటి ఫిర్యాదులకు పోలీసులు అంత వేగంగా స్పందించాల్సిన అవసరం లేదు, అంతకంటే ముఖ్యమైన కేసులు వారికి ఉండే ఉంటాయి. కానీ రాచకొండ పోలీసులు మాత్రం డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్ సహా అక్కడ వాలిపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఉంగరం వెదికి ఇచ్చారు.
అక్కడే అసలు కథ మొదలైంది..
ఉంగరం తిరిగిచ్చినందుకు బీజేపీ నేత ప్రభాకర్ పోలీసులకు ధన్యవాదాలు తెలపడంతోపాటు ఆ విషయాన్ని మీడియాకు చెప్పాడు, సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. శెభాష్ రాచకొండ పోలీస్ అంటూ కాస్త హైప్ ఇచ్చారు. తన నవరత్నాల ఉంగరాన్ని నిమిషాల వ్యవధిలో వెదికి ఇచ్చారని ప్రశంసించారు. అయితే ఆయన అనుకున్నదొకటి, అక్కడ అయింది ఇంకొకటి. సోషల్ మీడియా దాన్ని మరో కోణంలో చూసింది. సామాన్యులు ఫోన్ చేస్తే విసుక్కునే పోలీసులు ఓ రాజకీయ నాయకుడికి ఇంత విలువ ఇస్తారా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఒక ఉంగరం కోసం డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో సహా పొలాల్లోకి వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. ఫన్నీ కామెంట్స్ తో సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకున్నారు. ప్రభాకర్ కి ఉంగరం వెదికిచ్చినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని లబోదిబోమంటున్నారు పోలీసులు.