Telugu Global
Telangana

డీఎస్సీ, మరో డీఎస్సీ.. ప్రభుత్వం నవ్వులపాలవుతోందా..?

పరీక్షల వాయిదాకోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే, కొత్త నోటిఫికేషన్ అంటూ భట్టి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

డీఎస్సీ, మరో డీఎస్సీ.. ప్రభుత్వం నవ్వులపాలవుతోందా..?
X

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు జరగాల్సి ఉంది. అంతలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో డీఎస్సీ అంటూ షాకిచ్చారు. భర్తీ చేయాల్సిన పోస్ట్ ల సంఖ్యపై సమాచారం ఉంటే.. మొత్తానికి ఒకేసారి నోటిఫికేష్ విడుదల చేస్తే సరిపోయేది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసింది. మెగా డీఎస్సీ పేరుతో దగా చేస్తున్నారంటూ అటు అభ్యర్థులు, ఇటు ప్రతిపక్షాలు రచ్చ చేస్తుండే సరికి డిప్యూటీ సీఎం కొత్త డీఎస్సీ అంటూ కొత్త కబురు చెప్పారు. అయితే ఆ ప్రకటనతోనే ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుందని అంటున్నాయి ప్రతిపక్షాలు.

పోస్ట్ ల సంఖ్య ఖాళీగా కనపడుతున్నా కూడా తక్కువ పోస్ట్ ల భర్తీకి ప్రభుత్వం సిద్ధపడిందని చెప్పడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం ఇంకేముంటుందని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడం కూడా మరో మోసమేనంటున్నాయి. డీఎస్సీ రాస్తున్న అభ్యర్థులకు ఒకేరోజు వేర్వేరు కేంద్రాల్లో పరీక్షలకు హాల్ టికెట్లు జారీ చేయడంతో ఆల్రడీ ప్రభుత్వం పరువుపోయిందని, ఇప్పుడు రెండో డీఎస్సీ అంటూ కాంగ్రెస్ నేతలు తమ చేతగానితనాన్ని తామే రుజువు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ మండిపడుతోంది. పరీక్షల వాయిదాకోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే, కొత్త నోటిఫికేషన్ అంటూ భట్టి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.


ఏ హోదాలో..

ఇంతకీ కొత్త డీఎస్సీ అంటూ డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనని అభ్యర్థులు ఎలా పరిగణలోకి తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రకనట చేశారా, లేక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా హామీ ఇచ్చారా..? తేల్చి చెప్పాలంటున్నారు. ఇలాంటి విషయాన్ని సెక్రటేరియట్ లో చెప్పకుండా.. గాంధీభవన్ లో ఎందుకు చెబుతున్నారని నిలదీశారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని నిరుద్యోగులను అడ్డగోలు మాటలతో అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇది కేవలం నిరుద్యోగులను మభ్యపెట్టే మరో ప్రయత్నం అని మండిపడ్డారు.

First Published:  15 July 2024 5:34 AM GMT
Next Story