ఉద్యమకారుడెవడు..? ఉల్ఫాగాడు ఎవడు..??
ఢిల్లీ ఫొటోలతో మాయ చేయాలని చూసి, ఉద్యమంలో తన ఉనికి ఏపాటిదో ఆయనే బయటపెట్టుకున్నారు. ఉద్యమకారుడెవరో, ఉల్ఫాగాడు ఎవరనే విషయంలో బండి సంజయ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు.
బీజేపీ నేతలకు తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత లేదంటూ ఇటీవల టీఆర్ఎస్ విమర్శలు తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సాగర హారం రోజు అసలు బీజేపీ అడ్రస్ ఎక్కడంటూ కేటీఆర్ వేసిన ప్రశ్నలు వారికి మరింత మంటపెట్టాయి. దీంతో బండి సంజయ్ లైన్లోకి వచ్చారు. నేను ఉన్నప్పుడు నీవెక్కడ..? అంటూ నాలుగు ఫొటోలు ట్విట్టర్లో పెట్టారు. అయితే అక్కడే సంజయ్ చిన్న తప్పు చేశారు. సాగరహారంలో అడ్రస్ అడిగితే, ఢిల్లీ వీధుల్లో ఫొటోలు పెట్టి నెటిజన్లకు బుక్కయ్యారు.
ఈ ఫొటోలను ఇప్పుడు టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం హైలెట్ చేస్తూ సంజయ్ ని ఆటాడేసుకుంటోంది. తెలంగాణ కోసం ఇక్కడ ఉద్యమం చేయకుండా, ఢిల్లీ వీధుల్లో జెండాలు పట్టుకుని ఎందుకు తిరిగావయ్యా అంటూ ప్రశ్నించింది. సాగరహారంలో నా అడ్రస్ ఇదిగో అంటున్న బండి సంజయ్, ఢిల్లీ ఫొటోలు పెట్టి ఫూల్ అయ్యారంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ లేదు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం అని అంటున్నారు.
నేను ఉన్నప్పుడు నీవెక్కడ ?
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 30, 2022
సాగరహారం జరిగిన రోజు సారెక్కడ ?!
ఇప్పటి డొక్కు కారెక్కడ ?!!
ఉద్యమ వీరుల్ని బొందపెట్టి గద్దెనెక్కి మదమెక్కిన వాళ్లకు ఉద్యమకారుడెవడో ! ఉల్ఫాగాడు ఎవడో ఎలా తెలుస్తుంది ?!
ఒక సంకలో ఓవైసీని,
మరో వంక తెలంగాణ ద్రోహులను మోస్తున్న మోసగాళ్లు - అసలు మీరెక్కడ ? pic.twitter.com/lc3cHpYK6C
ఈటల వ్యాఖ్యలే నిదర్శనం కదా..?
ఇటీవల ఈటల రాజేందర్ కూడా తెలంగాణ ఇచ్చిందెవరు, తెచ్చిందెవరనే విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అయితే, ఇచ్చింది కాంగ్రెస్ అని, ఇన్నాళ్లూ ప్రజలు తెచ్చినవారినే గుర్తించారని చెప్పారు. ఆయన నోరు జారినా, అదే వాస్తవం. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ మినహా ఇంకెవరో అని చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికుంది..? కేసీఆర్ లేని తెలంగాణ ఉద్యమం ఎక్కడుంది..? జరిగింది సకల జనుల సమ్మే అయినా.. సకల జనుల్లోనూ కేసీఆర్ నింపిన ఆత్మవిశ్వాసం, తెలంగాణ ఆకాంక్ష ఉన్నాయి.
బండి ఫ్లాప్ షో..
ఢిల్లీలో తాను ఉద్యమం చేశానని, లాఠీ దెబ్బలు తిన్నానని, వాటర్ క్యానన్లకు ఎదురొడ్డానని చెప్పుకుంటున్నారు బండి సంజయ్. కానీ అక్కడ జరిగింది ధరల పెరుగుదలకు వ్యతిరేక నిరసన అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి సంజయ్.. ఎరక్కపోయి ఇరుక్కున్నారు. ఢిల్లీ ఫొటోలతో మాయ చేయాలని చూసి, ఉద్యమంలో తన ఉనికి ఏపాటిదో ఆయనే బయటపెట్టుకున్నారు. ఉద్యమకారుడెవరో, ఉల్ఫాగాడు ఎవరనే విషయంలో ఆయనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు.