Telugu Global
Telangana

ఘన్ పూర్ సెన్సేషన్.. ఇండిపెండెంట్ గా నవ్య నామినేషన్

జానకీ పురం గ్రామ సర్పంచ్ గా కుర్చపల్లి నవ్య పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోయినా.. రాజయ్యపై ఆరోపణలు చేసిన మహిళా సర్పంచ్ గా రాష్ట్రవ్యాప్తంగా ఆమె అందరికీ సుపరిచితమే. పలు ఇంటర్వ్యూల ద్వారా ఆమె సోషల్ మీడియా సెన్సేషన్ గా మారారు.

ఘన్ పూర్ సెన్సేషన్.. ఇండిపెండెంట్ గా నవ్య నామినేషన్
X

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని, బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరిని బరిలో దింపింది. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య కూడా ఇండిపెంటెండ్ గా బరిలో నిలిచారు. ఘన్ పూర్ లో ఆమె చివరి రోజున నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె చివరి వరకు బరిలో ఉంటారా, లేక నామినేషన్ ఉపసంహరించుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

ఎవరీ నవ్య..?

జానకీ పురం గ్రామ సర్పంచ్ గా కుర్చపల్లి నవ్య పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోయినా.. రాజయ్యపై ఆరోపణలు చేసిన మహిళా సర్పంచ్ గా రాష్ట్రవ్యాప్తంగా ఆమె అందరికీ సుపరిచితమే. పలు ఇంటర్వ్యూల ద్వారా ఆమె సోషల్ మీడియా సెన్సేషన్ గా మారారు. రాజయ్యపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసినా, సరైనా సాక్ష్యాధారాలు చూపించలేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే ఆమె తనకు న్యాయం జరగలేదని, న్యాయపోరాటం చేస్తానని అంటున్నారు. బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించినా ఆమెను ఎవరూ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు.

రాజయ్యకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడానికి నవ్య చేసిన ఆరోపణలే ప్రధాన కారణం అంటున్నారు స్థానిక నేతలు. అప్పట్లో రాజయ్య వార్తల్లో వ్యక్తిగా మారారు. అందులోనూ సొంత పార్టీ మహిళా సర్పంచ్ తో ఆయన అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత నవ్యతో రాజయ్య రాజీ చర్చలు కూడా జరిగాయి. కానీ మళ్లీ సీన్ రివర్స్ అయింది. మొత్తమ్మీద, రాజయ్య ఎపిసోడ్ తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నవ్య ఇప్పుడు నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.

First Published:  10 Nov 2023 7:41 PM IST
Next Story