Telugu Global
Telangana

అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు.. బాసరలో ఉద్రిక్తత

సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్‌ దిష్టిబొమ్మను దగ్దం చేశారు‌.‌

అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు.. బాసరలో ఉద్రిక్తత
X

ఇటీవల అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బైరి నరేశ్ అనే వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బైరి నరేశ్ ఆ వ్యాఖ్యలు చేసే సమయంలో ఆయన పక్కనే ఉండి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచిన మరో వ్యక్తి పేరు రేంజర్ల రాజేశ్. బైరి నరేశ్ తోపాటు అతనిపై కూడా కేసు నమోదు చేయాలని అప్పట్లో అయ్యప్ప స్వాములు నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రామంలో ఆందోళనకు దిగారు. తాజాగా రాజేశ్ సరస్వతి దేవిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బాసరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాసర గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు, స్కూల్స్‌ మూసివేసి బంద్‌ పాటించారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్‌ దిష్టిబొమ్మను దగ్దం చేశారు‌.‌ బాసర పోలీస్‌ స్టేషన్‌ లో రేంజర్ల రాజేశ్‌పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌ ఇటీవల వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ లో నిర్వహించిన సభలో అయ్యప్ప స్వామి సహా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. అతనితోపాటు స్టేజిపై ఉన్న వారు కూడా గతంలో హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడారు. తాజాగా రేంజర్ల రాజేశ్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో అతడిని కూడా అరెస్ట్ చేయాలంటూ బాసర గ్రామస్తులు డిమాండ చేస్తున్నారు, పోలీస్ కేసు పెట్టారు.

First Published:  3 Jan 2023 11:12 AM IST
Next Story