Telugu Global
Telangana

మహారాష్ట్రలో కేసీఆర్.. మహా వికాస్ అఘాడీలో కలవరం

సొంత రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధిస్తామనే గెలుపు ధీమా ఉంది కాబట్టే.. మహారాష్ట్రలో కూడా తెలంగాణ మోడల్ ని అమలు చేస్తామని ధీమాగా చెబుతున్నారు కేసీఆర్. పొరుగు రాష్ట్రంలో తెలంగాణ మోడల్ గురించి విస్తృత చర్చకు తెరలేపారు.

మహారాష్ట్రలో కేసీఆర్.. మహా వికాస్ అఘాడీలో కలవరం
X

మహారాష్ట్రలో అలజడి మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనతో మహారాష్ట్రలో రాజకీయ పక్షాలు ఉలిక్కి పడుతున్నాయి. మహావికాస్ అఘాడీ అప్పుడే మాటల తూటాలు విసురుతోంది. కూటమి తరపున శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో ఓటమి భయంతోనే ఆ పార్టీ మహారాష్ట్రలోకి వస్తోందని అన్నారు సంజయ్ రౌత్.

భయమెవరికి..?

నిజంగా ఓటమి భయం ఉంటే బీఆర్ఎస్ తెలంగాణను వదిలిపెట్టి రాదు. సొంత రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధిస్తామనే గెలుపు ధీమా ఉంది కాబట్టే.. మహారాష్ట్రలో కూడా తెలంగాణ మోడల్ ని అమలు చేస్తామని ధీమాగా చెబుతున్నారు కేసీఆర్. పొరుగు రాష్ట్రంలో తెలంగాణ మోడల్ గురించి విస్తృత చర్చకు తెరలేపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకి కూడా కావాలంటూ మహారాష్ట్ర రైతులు ఆందోళన చేస్తున్నరంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంత ఉలుకెందుకు..?

కేసీఆర్ ఆధ్యాత్మిక పర్యటనకు మహారాష్ట్ర వెళ్లారు, అంత మాత్రాన సంజయ్ రౌత్ కి అంత ఉలుకెందుకు. కేసీఆర్ భారీ కాన్వాయ్, అడుగడుగునా ఆయనకు ప్రజలు నీరాజనం పలకడం మహారాష్ట్ర మీడియాలో కూడా హైలెట్ అవుతోంది. బీజేపీ నేతలు కాస్త ఆచితూచి స్పందించాలనుకుంటున్నారు. ఉద్ధవ్ సేన నాయకుడు సంజయ్ రౌత్ మాత్రం ఉలిక్కిపడుతున్నారు.

సోలాపూర్ లోక్ సభ నియోజకవర్గంతోపాటు ఆ పరిధిలోకి వచ్చే మెజార్టీ అసెంబ్లీ సీట్లలో కూడా బీజేపీ ప్రాబల్యం ఉంది. కేసీఆర్ పర్యటనతో బీజేపీ నేతలు కూడా కంగారు పడుతున్నారు. సోలాపూర్ లో తెలంగాణ నుంచి వలస వెళ్లిన కుటుంబాలు కూడా అధికం. దీంతో అక్కడ రాజకీయ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ ఎంట్రీతో తమ ఉనికి గల్లంతవుతుందనుకుంటున్న నేతలు ముందుగానే విమర్శలు ఎక్కుపెట్టారు.

First Published:  27 Jun 2023 7:00 AM GMT
Next Story