మోడీ కేబినెట్‌లోకి బండి సంజయ్, కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కనుండడంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు అనివార్యం కానుంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అర్వింద్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ముందున్నారు.
తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు ఎవరు దక్కించుకుంటారన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మోడీ 3.0 కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి డి.కె.అరుణ, మెదక్ నుంచి రఘునందన్ రావు విజయం సాధించారు. గెలిచిన వాళ్లందరూ సీనియర్లు కావడంతో.. అంతా కేంద్రమంత్రి పదవులు ఆశించారు. ప్రధానంగా డి.కె.అరుణ, ఈటల రాజేందర్ పేర్లు వినిపించాయి. కాగా, చివరికి హైకమాండ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ల పేర్లు ఖరారు చేసింది. ఈ మేరకు ఈ ఇద్దరికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది.
కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కనుండడంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు అనివార్యం కానుంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అర్వింద్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ముందున్నారు. త్వరలోనే ఈ అంశంపైనా క్లారిటీ రానుంది.