Telugu Global
Telangana

జగ్గారెడ్డికి ఓ లవ్ స్టోరీ.. అందులో బోలెడన్ని ట్విస్టులు

సంగారెడ్డి ఎమ్మెల్యే తూరుపు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రూటే సెపరేటు. అంతే కాకుండా తనకూ ఓ లవ్ స్టోరీ ఉందని చెప్పుకొచ్చారు.

జగ్గారెడ్డికి ఓ లవ్ స్టోరీ.. అందులో బోలెడన్ని ట్విస్టులు
X

సంగారెడ్డి ఎమ్మెల్యే తూరుపు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రూటే సెపరేటు. ఆయన ఆహార్యం, మాట తీరు అంతా ఓ ఎమ్మెల్యేలాగ కాకుండా కరుడు గట్టిన గూండాలా ఉంటుంది. ఆ విషయాన్ని స్వయంగా జగ్గారెడ్డే ఒప్పుకున్నారు. అంతే కాకుండా తనకూ ఓ లవ్ స్టోరీ ఉందని చెప్పుకొచ్చారు. ఈ ముచ్చటకు సంగారెడ్డి జిల్లా మహిళా కళాశాల వేదికైంది. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వుమెన్స్ కాలేజీకి వెళ్లిన జగ్గారెడ్డి.. సాధారణంగా మాట్లాడే రాజకీయాలు కాకుండా.. తన సొంత విషయాలను చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

తనను చూసిన వాళ్లందరూ మాస్, రౌడీ అని అనుకుంటారు. కానీ తనలో కూడా క్లాస్ మనిషి ఉన్నాడని చెప్పారు. నన్ను చూస్తే వీడసలు చదువుకున్నాడా? నిశానీ గాడు అయ్యుంటాడు అని అందరూ భావిస్తారు. అయితే నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ ఫెయిల్ అవ్వడం వల్ల.. అందరికీ టెన్త్ అని చెప్పుకుంటానని జగ్గారెడ్డి వివరించారు. అసలు చదువు బంద్ పెట్టి నేను గాలి తిరుగుళ్లు ఏమీ తిరగలేదు.. నేరుగా రాజకీయాల్లోకే వచ్చానని జగ్గారెడ్డి చెప్పారు.

నేను పదో తరగతిలో ఉండగా ఓ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. నేను ఇంటర్ ఫెయిల్ అయినా.. ఆ అమ్మాయి మాత్రం డిగ్రీ పూర్తి చేసి తర్వాత గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నది. అయితే అంతకు ముందే తనకు నా ప్రేమ గురించి చెప్పాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని నేరుగా అడిగేశాను అని జగ్గారెడ్డి అన్నారు. అయితే ఆ అమ్మాయి చాలా రోజుల వరకు తన నిర్ణయాన్ని చెప్పలేదు. నేను ప్రతీ రోజు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. చివరకు ఒక రోజు తన ప్రేమకు ఓకే చెప్పింది. ఆమె ఎవరో కాదు.. ఇదుగో ఇక్కడ పక్కన కూర్చున్న నా భార్యే అని విద్యార్థినులకు పరిచయం చేశారు.

జగ్గారెడ్డి తన లవ్ స్టోరీ చెబుతున్నంత సేపు కాలేజీ ఆడిటోరియంలో ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది. తన భార్యే తన లవ్ అని చెప్పగానే విద్యార్థినులు చప్పట్లు కొట్టి అభినందించారు. తన భార్య నిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నానని.. అయితే పెళ్లికి ముందే ఉద్యోగం మానేసి తన బాగోగులు చూసుకుంటోందని జగ్గారెడ్డి చెప్పారు. నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. నిర్మలే తన పెద్ద అండ అని జగ్గారెడ్డి అన్నారు. ఎప్పుడూ రాజకీయ విమర్శలు చేస్తూ గంభీరంగా ఉండే జగ్గారెడ్డి.. ఇలా ఓపెన్ అయిపోవడంతో విద్యార్థినులు కేరింతలతో అభినందనలు తెలియజేశారు. మీ లవ్ స్టోరీ సినిమాకు ఏమీ తక్కువ లేదంటూ కేకలేశారు.

First Published:  7 Sept 2022 7:23 PM IST
Next Story