జై బీఆర్ఎస్.. పక్క రాష్ట్రాల్లోనూ సంబరాలు..
బీఆర్ఎస్ ఏర్పాటు సమయంలో దేశవ్యాప్తంగా అంతకంటే భారీ ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. బీఆర్ఎస్ ప్రకటనకు ముందే ఈ ప్రచారం జోరందుకుంది.
జై కేసీఆర్, జై బీఆర్ఎస్.. ఈ నినాదాలు కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి. కేసీఆర్ పథకాలను అభిమానించే ఇతర రాష్ట్రాల రైతులు, రైతు సంఘాల నేతలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. దేశ విదేశాల్లోని టీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ ని స్వాగతించే ఏర్పాట్లలో మునిగిపోయారు. తాజాగా ఒడిశాలోని పూరీ తీరంలో కూడా కేసీఆర్ సైకత శిల్పం ఏర్పాటు చేశారు.
జాతీయ నాయకులకు శుభాకాంక్షలు తెలిపే సందర్భంలో పూరీ తీరంలో సైకత శిల్పాలు ఏర్పాటు చేస్తుంటారు. తాజాగా ఇక్కడ కేసీఆర్ సైకత శిల్పం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నాయకులు అలిశెట్టి అరవింద్ దీన్ని ఏర్పాటు చేయించారు. ప్రముఖ సైకత శిల్పి సాహు దీని రూపకర్త.
దేశ్ కీ నేత..
దేశ్ కీ నేత, కిసాన్ కీ భరోసా.. కేసీఆర్ అంటూ ఈ సైకత శిల్పంపై స్లోగన్లు రాశారు. టీఆర్ఎస్ గులాబి రంగుతో, కారు గుర్తుని పెట్టి దీన్ని రూపొందించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినా.. కారు గుర్తు మారదని అంటున్నారు. అందుకే కారు గుర్తుని ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలెట్ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆమధ్య కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఆయన ఫ్లెక్సీలు, బ్యానర్లు హైలెట్ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పాటు సమయంలో దేశవ్యాప్తంగా అంతకంటే భారీ ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. బీఆర్ఎస్ ప్రకటనకు ముందే ఈ ప్రచారం జోరందుకుంది.