అమావాస్యనాడు నరబలి..! అసలు కారణం ఇది..
నరబలి అనే ప్రచారం జరగడంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాసులు ఉలిక్కి పడ్డారు. సనత్ నగర్ లో ఉన్నవారు షాకయ్యారు.
హైదరాబాద్ లో అమావాస్యనాడు నరబలి జరిగిందని, సనత్ నగర్ లో ఓ హిజ్రా.. ఎనిమిదేళ్ల బాలుడిని బలి ఇచ్చిందనే పుకార్లు కలకలం రేపాయి. అయితే ఈ కేసులో అసలు విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ఎనిమిదేళ్ల బాలుడి హత్య వాస్తవమేనని అయితే అమావాస్య రోజు నరబలి ఇచ్చారంటున్న వార్తల్లో నిజం లేదని తేల్చారు. ఇమ్రాన్ అనే హిజ్రా ఈ హత్య చేసినట్టు నిర్థారించారు, హత్య చేసినవారిని, అందుకు సహకరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సనత్ నగర్ లో ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు బాలుడి హత్య నరబలి కాదని పోలీసులు తెలిపారు. వహీద్ హత్యకు ఆర్ధిక వివాదాలే కారణమని పేర్కొన్నారు. బాలుడి తండ్రి, ఇమ్రాన్ అనే హిజ్రా మధ్య చిట్టీ విషయంలో గొడవలు ఉన్నట్లు తేలిందన్నారు. ఆ కోపంతోనే వహీద్ ని తనతోపాటు తీసుకెళ్లిన ఇమ్రాన్ హత్యచేసి ఓ బకెట్ లో కుక్కినట్టు నిర్థారించారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, దగ్గర్లోని నాళా వద్ద పడేసినట్టు తేలింది. వహీద్ కోసం వెదుకుతున్న తల్లిదండ్రులకు మృతదేహం కనపడటంతో వారు షాకయ్యారు. ఇమ్రాన్ ఈ హత్య చేసినట్టు వారికి అనుమానం ఉండటంతో హిజ్రా ఇంటిని ధ్వంసం చేశారు. ఈ హత్యలో సాయపడినట్టు అనుమానాలున్న ఆటో డ్రైవర్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు.
అయితే ఈ వ్యవహారంపై నరబలి అనే ప్రచారం జరగడంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాసులు ఉలిక్కి పడ్డారు. సనత్ నగర్ లో ఉన్నవారు షాకయ్యారు. పోలీసులు నరబలి కాదని తేల్చారు. ఆర్థిక లావాదేవీల వల్లే వహీద్ ని ఇమ్రాన్ హత్యచేసినట్టు నిర్థారించారు. బాలుడి కిడ్నాప్ కు నలుగురు వ్యక్తులు సహకరించారని, ఇమ్రాన్ సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా అసలు విషయం బయటపడింది.