పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు మోక్షం..!
గతంలో వైట్, పింక్ రేషన్ కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం పింక్ కార్డులను పూర్తిగా ఎత్తేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికే ఆహారభద్రత కార్డులు జారీ చేసింది.
తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభించేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు ఎన్ని?, కొత్తగా వచ్చిన అప్లికేషన్లు ఎన్ని? అని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ్ సమీక్ష నేపథ్యంలో రేషన్‌కార్డుల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో 2014నుంచి రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం రావడంతో జనాల్లో కొత్త ఆశలు చిగురించాయి. పెండింగ్‌లో ఉన్న కార్డుల్ని మంజూరు చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. 6 గ్యారంటీలతో పాటు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పథకాల అమలులో రేషన్ కార్డు పాత్ర కీలకం కాబోతోంది. మహిళలకు రూ. 2500, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రూ.5లక్షలు, రూ.10లక్షల ఆరోగ్యబీమా పథకానికి రేషన్ కార్డు కంపల్సరీ. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలనే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కారు.
గతంలో వైట్, పింక్ రేషన్ కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం పింక్ కార్డులను పూర్తిగా ఎత్తేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికే ఆహారభద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్ కార్డులు పొందలేని వారికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా ఆహారభద్రత కార్డులిచ్చింది. ఈ లెక్కన రాష్ట్రంలో 90.14 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.83 కోట్లుగా ఉంది. రాష్ట్ర జనాభా 4 కోట్లు అనుకుంటే సుమారు 3 కోట్ల మంది ఆహారభద్రత కార్డులకు అర్హులుగా ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.