తెలంగాణ ప్రజలు కూడా జగన్ కావాలంటున్నారు -సజ్జల
అప్పుడు తమ పాలన బాగుందని మెచ్చుకున్నారు కదా, ఇప్పుడు రోడ్ల విషయంలో విమర్శించడం దేనికని ప్రశ్నించారు సజ్జల.
తెలంగాణలో డబుల్ రోడ్డు, ఏపీలో సింగిల్ రోడ్డు.. ఇక్కడ వెలుగు జిలుగులు, అక్కడ చీకట్లు.. అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ గురించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి రియాక్షన్లు మొదలయ్యాయి. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేసీఆర్ కామెంట్లపై స్పందించారు. అసలు తెలంగాణ ప్రజలు కూడా తమకు జగన్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారని చెప్పారు సజ్జల.
ఇటీవల ఏపీలో పెన్షన్ల వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ పాజిటివ్ గా స్పందించారు. ఏపీలో ఏడాదికేడాది పెన్షన్ పెంచుకుంటూ వెళ్లారని ప్రశంసించారు. తెలంగాణలో కూడా అలాగే పెన్షన్లు పెంచుకుంటూ వెళ్తామన్నారు. ఇదే విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. అప్పుడు తమ పాలన బాగుందని మెచ్చుకున్నారు కదా, ఇప్పుడు రోడ్ల విషయంలో విమర్శించడం దేనికని ప్రశ్నించారు.
గతంలో ఏడు మండలాలను తెలంగాణ నుంచి వేరు చేసి ఏపీలో కలిపిన విషయం తెలిసిందే. ఆ విలీన మండలాల ప్రజలు ఏపీ పాలన బాగుందని చెబుతున్నారని అన్నారు సజ్జల. మళ్లీ తెలంగాణకు వెళ్తారా అంటే లేదని చెబుతున్నారట. అంటే పాలన ఏ రాష్ట్రంలో బాగుందో వారికి తెలిసిందని చెప్పారు సజ్జల. ఏపీతో సరిహద్దు ఉన్న తెలంగాణ గ్రామాల ప్రజలు తమకు జగన్ సీఎం కావాలి అంటున్నారని తెలిపారు సజ్జల. అంటే పాలన ఎక్కడ బాగుందో అర్థం చేసుకోవచ్చన్నారు.