సురక్షితమైన జిల్లాగా ఆదిలాబాద్
తెలంగాణ వ్యక్తిగత భద్రత స్కోరు 42 కాగా, ఆదిలాబాద్ జిల్లా వ్యక్తిగత భద్రతా స్కోరు 85. ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనంగా ఈ భద్రత ర్యాంకింగ్స్ వచ్చాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 అవార్డుల్లో తొలి మూడు స్థానాలు తెలంగాణ జిల్లాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. స్వచ్ఛతలో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తే.. ఇప్పుడు భద్రతలో తెలంగాణ పటిమను దేశవ్యాప్తంగా చాటి చెప్పింది ఆదిలాబాద్ జిల్లా. దేశంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాల జాబితాలో చోటు సంపాదించింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన జాబితాలో ఆదిలాబాద్ కి ఈ అరుదైన గౌరవం దక్కింది.
అక్షరమాలలో మొదట, అభివృద్ధిలో చివర.. ఆమధ్య ఆదిలాబాద్ గురించి ఎవరు ఏం రాయాలనుకున్నా ఇంట్రో ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కూడా అభివృద్ధి ఫలాలను అందుకుంటోంది. తాజాగా అత్యంత సురక్షితమైన జిల్లాల జాబితాలో చోటు సంపాదించింది. దేశవ్యాప్త గుర్తింపు సాధించింది.
నూటికి 85 మార్కులు..
దేశంలోనే సురక్షితమైన జిల్లాల లిస్ట్ ని కేంద్రం తయారు చేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ద్వారా సామాజిక ప్రగతి సూచిక, సురక్షితమైన జిల్లాల నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 85 మార్కులతో ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లాగా దేశంలో ఐదో స్థానాన్ని సంపాదించింది. తెలంగాణలో మొదటి స్థానం దక్కించుకుంది. ఈ సర్వే లో 89 సూచికలను పరిగణలోకి తీసుకున్నారు, అందులో ముఖ్యమైనవి మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్, హత్యలు, రోడ్డు మరణాలు, హింసాత్మక నేరాలు ఉన్నాయి. వ్యక్తిగత భద్రత పరిమితి లెక్కించేందుకు వీటిని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో ఆదిలాబాద్ కి 85 మార్కులు రావడం విశేషం.
తెలంగాణలో వ్యక్తిగత భద్రత స్కోరు 42 కాగా, ఆదిలాబాద్ జిల్లాలో వ్యక్తిగత భద్రతా స్కోరు 85. ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనంగా ఈ భద్రత ర్యాంకింగ్స్ వచ్చాయి. ర్యాంకుల ప్రకటన తర్వాత జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డిని పలువురు ప్రముఖులు అభినందించారు.