తాంత్రికులు చెప్పారని కేసీఆర్ మహిళలకు మంత్రిపదవులివ్వలేదన్న నిర్మల, కౌంటర్ ఇచ్చిన సబిత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక విద్యలు నమ్మి మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తిప్పికొట్టారు.
బీజేపీ నాయకులందరికీ తెలంగాణ పై ఎప్పుడూ ఆక్రోశంగానే ఉంటుంది. కేంద్ర నాయకులైతే సరైన సమాచారం కూడా తెలుసుకోకుండా ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారు. అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకరు. ఈ మధ్యనే ఓ రేషన్ షాపులో మోడీ ఫోటో పెట్టలేదని హల్ చల్ చేసిన ఆమె ఇప్పుడు కేసీఆర్ మీద ఓ అబద్దపు ఆరోపణ చేశారు. పైగా కేసీఆర్ తాంత్రికుల మాటల మేరకు నడుచుకుంటారనే తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేశారు.
ట్విట్టర్ లో నిర్మల ఓ వీడియో రిలీజ్ చేశారు. మహిళలకు రాష్ట్ర క్యాబినెట్ లో చోటిస్తే చెడు జరుగుతుందని తాంత్రికులు చెప్పడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళలను క్యాబినెట్లోకి తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. అంతే కాదు 'కేసీఆర్ ప్రాక్టీసెస్ బ్లాక్ మ్యాజిక్' అని ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా పెట్టారు.
అసలు తెలంగాణ మంత్రి వర్గంలో మహిళలు ఉన్నారా లేదా కూడా కేంద్ర మంత్రికి తెలియకపోవడం ఆశ్చర్యమే. ఇద్దరు మహిళా మంత్రులు తెలంగాణ క్యాబినెట్ లో ఉన్నారన్న విషయం ఆమెకు స్థానిక నేతలు కూడా ఎందుకు చెప్పలేదో తెలియదు.
ఇక నిర్మాలా సీతారామన్ మాటలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిర్మాలా సీతారామన్ వీడియోను షేర్ చేస్తూ '' అమ్మా నిర్మలా సీతారామన్ గారూ, తెలంగాణ ప్రభుత్వంలో నేను, సత్యవతి రాతోడ్ ఇద్దరం మహిళా మంత్రులం ఉన్నాము. గత 3 సంవత్సరాలుగా కేసీఆర్ గారి చైతన్యవంతమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నాము. ఈ ప్రాథమిక సమాచారం కూడా మీకు తెలియకపోవడం మీకు ఇబ్బందికరంగా లేదా?'' అని ప్రశ్నించారు సబితా ఇంద్రా రెడ్డి.
ఈ విషయంపై నెటిజనులు కూడా నిర్మలా సీతారామన్ మీద విమర్శలు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం కూడా లేకుండా కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే కేసీఆర్ బ్లాక్ మ్యాజిక్ (తాంత్రిక విద్యలు) నమ్ముతారనే అబద్దపు ప్రచారం చేయడం ఓక కేంద్ర ఆర్థిక మంత్రి స్థాయి వ్యక్తికి శోభనిస్తుందా అని నెటిజనులు మండిపడుతున్నారు.
Amma @nsitharaman garu, there are two women ministers in the TS Govt. Myself and my colleague @SatyavathiTRS have been serving the ppl of our state under the dynamic leadership of KCR garu for the last 3 yrs. It's embarrassing on your part that you are not informed on this basic+ https://t.co/YKpnkWJrTb
— SabithaReddy (@SabithaindraTRS) October 8, 2022