'రైతు నేస్తం' అంటే ఏంటి..? ఎవరికోసం..?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలోనూ రైతు వేదికలు నిర్మించారు. ఆ రైతు వేదికలపై కాంగ్రెస్ తన ముద్ర వేయాలనుకుంటోంది.
రైతు బీమా, రైతు ధీమా, రైతు బంధు, రైతు భరోసా, పీఎం కిసాన్.. ఇలా అన్నదాతల పేర్లతో ప్రారంభించిన ఏ పథకం అయినా అంతిమంగా వారికి కాస్తో కూస్తో ఆర్థిక సాయం చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 'రైతు నేస్తం' అనే కార్యక్రమం మొదలు పెట్టింది. రైతులకు ఆర్థిక సాయం అనే ఊసు లేకపోవడం ఈ పథకం ప్రత్యేకత. అయితే వారి ఆర్థిక లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.
వీడియో కాన్ఫరెన్స్ లకోసం..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలోనూ రైతు వేదికలు నిర్మించారు. ఆ రైతు వేదికలపై కాంగ్రెస్ తన ముద్ర వేయాలనుకుంటోంది. అందుకే వాటిని వీడియో కాన్ఫరెన్స్ లకు అనుగుణంగా మార్పులు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. దానికి 'రైతు నేస్తం' అనే పేరు పెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రత్యక్ష ప్రసారం: ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించి, వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖిలో పాల్గొంటున్న సీఎం శ్రీ @Revanth_Anumula.#RythuNestham https://t.co/reRVb7luDx
— Telangana CMO (@TelanganaCMO) March 6, 2024
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని అనుసంధానం చేస్తూ రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు స్థాపిస్తారు. మొత్తం 97 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు అమలు చేయబోతున్నారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 4.07 కోట్ల ఖర్చుతో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు అందుబాటులోకి తెస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో రైతులు నేరుగా ఆన్ లైన్ ద్వారా తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు, వారితో చర్చలు జరపొచ్చు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చు. ప్రతి మంగళ, శుక్రవారం విస్తరణాధికారులతో రైతు నేస్తం కార్యక్రమం చేపడతారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.