ఈ టైమ్ లో కోర్టుకు వెళ్లలేం.. రైతులు ఓపిక పట్టండి
ఢిల్లీలోని ఈసీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని, రేపటి(మంగళవారం)కల్లా ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా చూస్తామన్నారు. ఒకవేళ తమ ప్రయత్నం ఫలించకపోతే.. రైతులు అర్థం చేసుకుని రెండు మూడు రోజులు ఓపిక పట్టాలన్నారు కేశవరావు.
రైతుబంధు నిధుల విడుదలను అడ్డుకోవడం సరికాదంటూ.. సీఈవో వికాస్ రాజ్ ని కలసి అభ్యర్థించిన అనంతరం బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు ఆన్-గోయింగ్ స్కీమ్ అని, అలాంటప్పుడు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిధుల పంపిణీ ప్రక్రియకు ఎలా బ్రేక్ వేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈసీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని, రేపటి(మంగళవారం)కల్లా ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా చూస్తామన్నారు. ఒకవేళ తమ ప్రయత్నం ఫలించకపోతే.. రైతులు అర్థం చేసుకుని రెండు మూడు రోజులు ఓపిక పట్టాలన్నారు కేశవరావు. ఇప్పటికిప్పుడు కోర్టుకు వెళ్ళే టైమ్ లేదని వివరించారు.
కాంగ్రెస్ వారికి కూడా లబ్ధి జరగదు కదా..?
కాంగ్రెస్ నేతలు రైతుబంధుకి అడ్డుపడటం అర్థరహితం అన్నారు కేశవరావు. రైతుబంధు పొందుతున్న లబ్ధిదారుల్లో కాంగ్రెస్ కు చెందినవారు కూడా ఉన్నారు కదా అని ప్రశ్నించారు. రైతుబంధు ఆగిపోతే వారు కూడా నష్టపోతారు కదా అన్నారు. రైతుబంధు నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈసీ విధించిన నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే వారికి నోటీసులు ఇవ్వాలని.. అంతేకాని.. పూర్తిగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సమంజసం కాదని చెప్పారు కేకే. సీఈఓను కలిసి సమర్పించిన మెమొరాండంలో మంత్రి హరీష్ రావు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని కేశవరావు వివరణ ఇచ్చారు. రైతుబంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో కృతజ్ఞతాపూర్వకంగా మాత్రమే హరీష్ రావు ఆ అంశాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు కేకే.
ఒకసారి ఇచ్చిన ఉత్తర్వులను ఈసీ గతంలో ఎప్పుడూ వెనక్కు తీసుకోలేదంటూ సీఈఓ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు కేకే. మంగళవారం నాటికి రైతుబంధుపై క్లారిటీ వస్తుందని, ఈసీ తాజా ఉత్తర్వులు ఉపసంహరించుకునేలా చూస్తామన్నారాయన. ఒకవేళ అలా ఉపసంహరించుకోకపోతే.. కొత్త ప్రభుత్వంలో వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేస్తామని అన్నదాతలకు హామీ ఇచ్చారు కేకే.
♦