Telugu Global
Telangana

ఉచితం తెచ్చిన తంటా.. ఆర్టీసీ కండక్టర్ పై వేటు

కండక్టర్ కి మద్దతుగా మిగతా కార్మికులు కదం తొక్కారు. తమ సహోద్యోగిని విధులనుంచి తొలగించడం సరికాదంటూ వారు జనగామ డిపో ముందు ఆందోళన చేపట్టారు.

ఉచితం తెచ్చిన తంటా.. ఆర్టీసీ కండక్టర్ పై వేటు
X

తెలంగాణ ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం రోజుకో కొత్త గొడవకు కారణం అవుతోంది. కొన్నాళ్లు బస్సుల్లో సీట్లకోసం మహిళలు జుట్లు జుట్లు పట్టుకున్నారు. పురుషులు సీట్లు దొరకవని డిసైడ్ అయిపోయి ఆర్టీసీవైపు చూడ్డం మానేశారు. ఆటో డ్రైవర్లు తమ ఉపాధిని ఆర్టీసీ దెబ్బకొడుతోందని కంగారుపడి ప్రత్యామ్నాయ వృత్తులవైపు వెళ్తున్నారు. అవసరం ఉండి కాదు, పొద్దుపోక ఆర్టీసీ బస్సు ఎక్కి.. ఉల్లిపాయలు పొట్టు తీసుకునేవారు, గోరింటాకు పెట్టుకునేవారు, చివరకు బస్సులోనే బ్రష్ చేసుకునేవారిని కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఓ కండక్టర్ ఉద్యోగానికి ఎసరు పెట్టింది. అయితే ఆ కండక్టర్ కి మద్దతుగా మిగతా కార్మికులు కదం తొక్కారు. తమ సహోద్యోగిని విధులనుంచి తొలగించడం సరికాదంటూ వారు జనగామ డిపో ముందు ఆందోళన చేపట్టారు.

అసలేం జరిగింది..?

జనగామ నుంచి బయలుదేరిన బస్సు అప్పటికే కిక్కిరిసి ఉంది. దారిలో ఓ గర్భిణి బస్సు ఎక్కింది. ఆమెకు సీటివ్వడం కోసం, మరో మహిళను కాస్త లేచి నిలబడాలని కోరారు కండక్టర్ శంకర్. అయితే ఆమె ససేమిరా అన్నది. అక్కడ వారిద్దరికీ మాటా మాటా పెరిగింది. దీంతో ఆమె కోపంతో బస్సు దిగి వెళ్లిపోయింది. బస్సుదిగిన సదరు మహిళా ప్రయాణికురాలు నేరుగా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా వేదికగా బస్సులో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో అధికారులు కండక్టర్ దే తప్పని తేల్చారు. శంకర్ కి మెమో జారీ చేశారు, విధులకు హాజరు కావొద్దని తేల్చి చెప్పారు.

గర్భిణికి సీటు అడగడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు కండక్టర్ శంకర్. జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదంటున్నారాయన. శంకర్ తోపాటు, ఆయన కుటుంబ సభ్యులు, జనగామ డిపోలో పనిచేసే ఆర్టీసీ కార్మికులు ఈ విషయంపై నిరసనకు దిగారు. జనగామ డిపో ముందు ధర్నా చేపట్టారు. బస్సులు డిపోనుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

First Published:  7 Aug 2024 11:31 AM IST
Next Story