Telugu Global
Telangana

ఎకరం రూ.100 కోట్లు.. ఇది తెలంగాణ పరపతి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం : సీఎం కేసీఆర్

వేలంలో హైదరాబాద్ భూములు ఎకరానికి రూ.100 కోట్ల ధర పలకడం తెలంగాణ పరపతి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఎకరం రూ.100 కోట్లు.. ఇది తెలంగాణ పరపతి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం : సీఎం కేసీఆర్
X

హైదరాబాద్ సమీపం రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పొలిస్ ఫేజ్-2కు సంబంధించిన 45.33 ఎకరాలకు హెచ్ఎండీఏ గురువారం వేలంపాట నిర్వహించింది. దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీలు పడి మరీ.. ఈ ప్లాట్లను కొనుగోలు చేశాయి. 7 ల్యాండ్ పార్సిల్స్‌కు వేలం పాట జరుగగా.. హెచ్ఎండీయేకు రూ.3319.6 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో ప్లాట్ నంబర్ 10 కోసం భారీ పోటీ నెలకొన్నది. దీంతో ఎకరం ధర రూ.100.75 కోట్ల పలకడం గమనార్హం. కాగా, ప్రభుత్వ వేలంలో భారీ ధరలు పలకడంపై సీఎం కేసీఆర్ స్పందించారు.

వేలంలో హైదరాబాద్ భూములు ఎకరానికి రూ.100 కోట్ల ధర పలకడం తెలంగాణ పరపతి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి మరీ.. ఇంత ధర చెల్లించడం వెనుక ఉన్న మరో కోణాన్ని కూడా సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో అత్యధిక ధరకు భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా.. ప్రగతి కోణంలోనూ విశ్లేషించాలని చెప్పారు.

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకొని పోతున్న వర్తమాన పరిస్థితికి ఈ వేలం అద్దం పడుతున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం ఆగం అవుతుందని, ఇక్కడ భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించ పరిచిన వారికి ఇది చెంప చెళ్లుమనిపించే చర్యగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ఇది అలాంటి ఆరోపణలు చేసిన వారికి సరైన సమాధానంగా అర్థం చేసుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణను ఎవరెంత నష్టం చేయాలని చూసినా.. ధృఢ చిత్తంతో పల్లెలు, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితం ఇదని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.


First Published:  4 Aug 2023 8:27 AM IST
Next Story