Telugu Global
Telangana

ఫార్మా సిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల కుంభకోణం

ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలి : కేటీఆర్‌

ఫార్మా సిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల కుంభకోణం
X

ఫార్మా సిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల భూ కుంభకోణం ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి తన అన్నదమ్ములకు వేల కోట్లు దోచిపెట్టేందుకే ఈ భూమాయ కుట్ర చేస్తున్నాడని తెలిపారు. ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతో పాటు హైకోర్టును మోసం చేస్తుందన్నారు. గురువారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మాసిటీ రద్దు చేసి భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మా సిటీని రద్దుచేస్తున్నామని, ఆ స్థానంలో ఫార్మా విలేజీలు, ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుచేస్తామని అసెంబ్లీతోపాటు అనేక వేదికలపై ప్రకటించిందని గుర్తుచేశారు. ఫార్మాసిటీ రద్దు చేయకుండా ప్రభుత్వం చెప్తోన్న ఏఐ సిటీ, ఫోర్త్‌ సిటీ ఎక్కడ నిర్మాస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ఫార్మా సిటీకి సేకరించిన భూములను ఇతర అవసరాలకు వాడుకునే అవకాశమే లేదని, దీనిని తెలుసుకున్న తర్వాతే హైకోర్టును తప్పుదోవ పట్టించే కుట్రలు మొదలు పెట్టారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు ప్రకటించారని గుర్తు చేశారు.

కాగితాల పైన ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్తూనే ఇంకోవైపు భూ దందాల కోసం అవే భూములను అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, హైకోర్టుకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే, ఇది ముమ్మాటికి చీటింగ్ కిందికి వస్తుందని, ఇలాంటి నేరానికి పాల్పడుతున్న రాష్ట్ర సర్కారుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేవలం తన సోదరులకు, అనుయాయులకు వేల కోట్ల రూపాయల లబ్ధి చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తాము 14 వేల ఎకరాల్లో, రూ.64 వేల కోట్ల పెట్టుబడులతో ఫార్మా సిటీని ప్రతిపాదించామని గుర్తు చేశారు. ఉంటే ఫార్మాసిటీ తాము ప్రతిపాదించిన 14 వేల ఎకరాల్లో ఉండాలన్నారు. లేదంటే రైతులకు వారిచ్చిన భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములు ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుంటే రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ భూములను ఫోర్త్‌, ఫ్యూచర్‌ సిటీ పేరుతో తమ వాళ్లకు భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ పూర్తయితే లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఖజనాకు భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన వాళ్లవుతారని చెప్పారు. ప్రభుత్వం పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

First Published:  26 Sept 2024 8:18 PM IST
Next Story