Telugu Global
Telangana

సంచలనం.. బీఎస్పీకి ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ రాజీనామా

రెండు రోజుల క్రితమే బీఆర్ఎస్‌, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్‌, నాగర్‌కర్నూలు స్థానాలు కేటాయించింది బీఆర్ఎస్‌. నాగర్‌కర్నూలు నుంచి ఆర్.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది.

సంచలనం.. బీఎస్పీకి ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ రాజీనామా
X

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎస్పీకి ఆ పార్టీ స్టేట్ చీఫ్‌ RS ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. భారమైన హృదయంతో బహుజన్‌ సమాజ్‌ పార్టీని వీడుతున్నానని చెప్పారు.

పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందేనన్నారు. కష్ట సుఖాలు పంచుకోవాల్సిందేనన్నారు RS ప్రవీణ్‌కుమార్. ఇదే తాను నమ్మిన నిజమైన ధర్మం అన్నారు. బీఎస్పీ-బీఆర్ఎస్‌ పొత్తు ప్రకటన బయటకొచ్చిన వెంటనే.. బీజేపీ పొత్తును భగ్నం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనన్నారు. ఇకపై ప్రస్థానాన్ని ఆపలేనని చెప్పారు. తాను ఎవరిని నిందించడం లేదన్నారు. ఎవరిని మోసం కూడా చేయడం లేదన్నారు.

తనను విశ్వసించి కీలక బాధ్యతలు కట్టబెట్టినందుకు బెహన్‌ జీ మాయవతికి కృతజ్ఞతలు తెలిపారు RSP. కాన్షీరాం సామాజిక న్యాయం సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానన్నారు. ఇప్పటివరకూ తనకు అండగా నిలిచిన తెలంగాణ ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక RSP ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్‌లో చేరతారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది.

రెండు రోజుల క్రితమే బీఆర్ఎస్‌, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్‌, నాగర్‌కర్నూలు స్థానాలు కేటాయించింది బీఆర్ఎస్‌. నాగర్‌కర్నూలు నుంచి ఆర్.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. ఇంతలోనే ప్రవీణ్‌ కుమార్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

First Published:  16 March 2024 6:42 PM IST
Next Story