Telugu Global
Telangana

కీరవాణి పెత్తనం ఏందిభై..?

కీరవాణి సంగీతం ఇవ్వడానికి ఇది "నాటు నాటు" పాట కాదని, నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతి రూపం ఇదని అన్నారు RSP.

కీరవాణి పెత్తనం ఏందిభై..?
X

తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలం అని సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. "అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతం పై ఆంధ్రా' సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది?" అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ వచ్చి పదేళ్లయిన తర్వాత ఇప్పుడు స్వరకల్పన ఏంటని అడిగారు.


కీరవాణి సంగీతం ఇవ్వడానికి ఇది "నాటు నాటు" పాట కాదని, నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతి రూపం ఇదని అన్నారు RSP. అందెశ్రీ గీతం ఒక రణ నినాదం, ధిక్కార స్వరం అని చెప్పారు. ఆయన ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్ తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించిందని గుర్తు చేశారు. ఇప్పుడెందుకు ఆ ట్యూన్ మార్చే సాహసం చేస్తున్నారని ప్రశ్నించారు.

జనగణమన, వందేమాతరంకు హాలీవుడ్ సంగీత దర్శకులు ట్యూన్ ఇచ్చారా అని ప్రశ్నించారు RSP. టాలీవుడ్, తెలంగాణ ఉద్యమం రెండూ వేర్వేరు అని, టాలీవుడ్ కేవలం వినోదం కోసం మాత్రమేనని, మరోవైపు తెలంగాణ గీతం ప్రజల ఉద్వేగంతో కూడుకున్నదని చెప్పారాయన. పాపం అందెశ్రీ అమాయకుడు, నిస్సహాయుడు కాబట్టి మౌనంగా కూర్చున్నారని సీఎం ఏం చేసినా భరిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రా సంగీత దర్శకులను సంతోషపరచాలని అనుకుంటే.. రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్లి అక్కడ సీఎం కావాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని తెలంగాణ భావోద్వేగాలను గౌరవించకపోతే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ టాలెంట్ ని కూడా ప్రోత్సహించాలి కదా అని అడిగారు RSP.

ఏది పాడదాం..?

తెలంగాణ ప్రజలారా, జూన్ 2 నాడు ఏ గీతాన్ని ఆలపిద్దామని ప్రశ్నించారు RSP. ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందమా, లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందమా? అంటూ ట్వీట్ చేశారు.

First Published:  28 May 2024 7:23 AM IST
Next Story