Telugu Global
Telangana

ఎకరం రూ.72 కోట్లు.. హెచ్ఎండీఏ వేలానికి భారీ డిమాండ్

భారీగా నిధులు సమీకరించాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ కోకాపేట్‌లోని నియో పోలిస్ ఫేజ్‌ 2లోని 45.33 ఎకరాల భూములను వేలం వేయాలని నిర్ణయించింది.

ఎకరం రూ.72 కోట్లు.. హెచ్ఎండీఏ వేలానికి భారీ డిమాండ్
X

ఎకరం రూ.72 కోట్లు.. హెచ్ఎండీఏ వేలానికి భారీ డిమాండ్

హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు ఎంత డిమాండ్ ఉందో మరోసారి రుజువయ్యింది. మాధాపూర్, గచ్చిబౌలి తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న కోకాపేట ప్రాంతంలోని ప్రభుత్వ భూములకు తాజాగా హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. నియో పోలిస్ ఫేజ్-2లోని భూములను ఆన్‌లైన్‌లో వేలం వేయగా.. దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాయి. ఇక్కడ వేలంలో అత్యధికంగా రూ.72 కోట్ల ధర పలకడం గమనార్హం. అత్యల్ప బిడ్ రూ.51.75 కోట్లుగా ఉన్నది.

భారీగా నిధులు సమీకరించాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ కోకాపేట్‌లోని నియో పోలిస్ ఫేజ్‌ 2లోని 45.33 ఎకరాల భూములను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ భూముల అమ్మకం ద్వారా దాదాపు రూ.2,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వేలంలో ఎకరానికి కనిష్ట అప్ సెట్ ధర ఎకరానికి రూ.35 కోట్లుగా నిర్ణయించింది. ఒక్కో బిడ్ ఇంక్రిమెంట్ చేయడానికి రూ.25 లక్షలకు పాడాల్సి ఉన్నది. ఎకరం కనీసం రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు పలికితే.. హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకున్న రూ.2,500 కోట్లు వస్తాయని అంచనా వేసింది.

అయితే, హెచ్ఎండీఏ అంచనాలను మించి స్థిరాస్థి సంస్థలు భారీ రేటుకు ఇక్కడి భూములను సొంతం చేసుకున్నాయి. ఇప్పటి వరకు నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్లను వేలం వేయగా హెచ్ఎండీఏకు రూ.1,532.50 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు నియో పోలీస్‌లో 26.86 ఎకరాల స్థలాన్ని మాత్రమే అమ్మారు. మరో 18 ఎకరాలకు పైగా భూములకు వేలం నిర్వహించాల్సి ఉన్నది.

నియో పోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6లో 7 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 7లో 6.55 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 8లో 0.21 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 9లో 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 11లో 7.53 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 14లో 7.34 ఎకరాలు.. మొత్తం 45.33 ఎకరాలకు వేలం నిర్వహిస్తున్నారు.

First Published:  3 Aug 2023 11:36 AM GMT
Next Story