Telugu Global
Telangana

వరదల్లో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో దాదాపు రూ.414 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

వరదల్లో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం : మంత్రి ఎర్రబెల్లి
X

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. కొన్ని చోట్ల వరద కారణంగా ప్రాణనష్టం కూడా సంభవించింది. ఇక రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో కూడా వరదలు జనజీవనాన్ని స్తంభింప చేశాయి. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించిన వరదల నష్టంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ రెండు జిల్లాల పరిధిలో వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అలాగే క్షతగాత్రులకు రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నారు.

వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో దాదాపు రూ.414 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.రహదారులు, కల్వర్టులు, కాలువలకు రూ.177 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు చెప్పారు. వరదల ఉధృతికి 207 ఇళ్లు పూర్తిగా, 480 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తేలిందని మంత్రి చెప్పారు. లోతట్టు కాలనీల నుంచి తరలించిన ప్రజలకు పునరావాసం కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని.. అవసరమైన సహాయక బృందాలను పంపారని తెలిపారు. వరదల కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరదల తగ్గిన తర్వాత పారిశుథ్యంపై దృష్టిపెట్టాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

వరంగల్‌లోని భద్రకాళి చెరువు పరివాహక ప్రాంతంలో ప్రజలు వరదల కారణంగా తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. నీళ్లు దిగువ కాలనీలను చుట్టకముందే అప్రమత్తమైన అధికారులు.. కాలనీ వాసులను ఖాళీ చేయించారు. చెరువుకు గండి పడిన ప్రాంతాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ సందర్శించి.. తీసుకోవల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశనం చేశారు.

First Published:  30 July 2023 9:51 AM IST
Next Story