Telugu Global
Telangana

వివాదంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

ఈ ఘటనపై MIM చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, RSS తెలంగాణలో అల్లర్లు సృష్టించేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు.

వివాదంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత
X

హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానంలో అసదుద్దీన్‌ ఓవైసీ ప్రత్యర్థి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత వివాదంలో చిక్కుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా యాత్రలో పాల్గొన్న మాధవీలత.. ఓల్డ్‌ సిటీలోని సిద్ధంబర్ బజార్‌ క్రాస్‌రోడ్స్‌కు చేరుకోగానే.. మసీదును టార్గెట్‌ చేస్తూ మాదవీలత బాణం ఎక్కుపెడుతున్నట్లు ఫోజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మాధవీలత చర్యల పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో నెగెటివ్‌ కామెంట్స్ రావడంతో ఈ వివాదంపై ఆమె స్పందించారు. అసంపూర్తిగా ఉన్న వీడియోను వైరల్ చేస్తున్నారని, తన చర్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు మాధవీలత.

ఈ ఘటనపై MIM చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, RSS తెలంగాణలో అల్లర్లు సృష్టించేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు. మాధవీలత చర్యలు ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. గత 15 ఏళ్లుగా హైదరాబాద్, తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు రావడంతో పాటు తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. అన్ని వర్గాల మధ్య సామరస్యం ఉండడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బీజేపీ చర్యలను ప్రజలు ఏ మాత్రం సహించబోరని చెప్పారు. వికసిత్‌ భారత్ అంటే ఇదేనా అని బీజేపీకి ప్రశ్నలు సంధించారు.

మరోవైపు మాధవీలత మసీదును టార్గెట్ చేస్తూ బాణం ఎక్కుపెట్టిన చర్యలపై ఈసీని సంప్రదించగా.. ఇప్పటివరకూ అలాంటిది తమ నోటీసుకు రాలేదని స్పష్టం చేశారు అధికారులు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

First Published:  19 April 2024 9:20 AM IST
Next Story