Telugu Global
Telangana

టీఎస్ఆర్టీసీలో రోల్ ఆఫ్ హానర్ అవార్డులు.. సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి

ఇకపై డిపో స్థాయిలో నెలకు ఒకసారి, ప్రాంతీయ స్థాయిలో మూడు నెలలకు ఒకసారి, జోనల్ స్థాయిలో ఆరు నెలలకు ఒకసారి, కార్పొరేట్ స్థాయిలో ఏడాదికి ఒకసారి అవార్డులు అందజేస్తామని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి తెలిపారు.

టీఎస్ఆర్టీసీలో రోల్ ఆఫ్ హానర్ అవార్డులు.. సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి
X

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో పని చేస్తూ.. ఉత్తమ సేవలు అందించిన హెల్పర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు, అధికారులకు అవార్డులు అందించారు. ఆర్టీసీ (ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ)లో ఇలా అవార్డులు అందజేయడం ఇదే తొలి సారని అధికారులు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారిని ప్రోత్సహించేందుకు గాను ఈ అవార్డులు అందజేసినట్లు చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

రోల్ ఆఫ్ హానర్, ఎక్స్‌ట్రా మైల్, ఇన్నోవేషన్, బెస్ట్ ఎంప్లాయ్, ఉత్తమ డిపో, ఉత్తమ రీజియన్ వంటి కేటగిరీల్లో దాదాపు 500 మందికి ఈ అవార్డులను మంగళవారం ప్రదానం చేశారు. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో అవార్డు గ్రహీతలకు మెమెంటో, శాలువా, ప్రశంసా పత్రాలను అందించారు. ఉత్తమ పనితీరు కనపరిచిన 24 మంది ఉద్యోగులు, అధికారులకు రోల్‌ ఆఫ్ హానర్ కింద అవార్డులు అందించారు. వీరితో పాటు నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేసిన వారికి గౌరవప్రదమైన గుర్తింపుతో ప్రత్యేకంగా సత్కరించారు.

ఇకపై డిపో స్థాయిలో నెలకు ఒకసారి, ప్రాంతీయ స్థాయిలో మూడు నెలలకు ఒకసారి, జోనల్ స్థాయిలో ఆరు నెలలకు ఒకసారి, కార్పొరేట్ స్థాయిలో ఏడాదికి ఒకసారి అవార్డులు అందజేస్తామని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి తెలిపారు. సమష్టి కృషితోనే సంస్థకు మంచి పేరు వస్తోందని, గడ్డు పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలిగే స్థాయికి ఎదగడంలో ప్రతీ ఒక్కరి కృషి ఉందని ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.

ఉత్తమ డిపో కేటగిరీలో ప్రథమ స్థానం మహబూబ్‌నగర్‌కు, ద్వితీయ స్థానం స్తతుపల్లి, తృతీయ స్థానం ఇబ్రహీంపట్నం దక్కింది. దసరా, సంక్రాంతి చాలెంజ్‌లో ఉత్తమ రీజియన్లుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు ప్రథమ స్థానం.. అదిలాబాద్, కరీంనగర్‌కు ద్వితీయ స్థానం.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌కు తృతీయ స్థానం లభించింది.

రోల్ ఆఫ్ హానర్ అవార్డు గ్రహీతలు..

ఉత్తమ డ్రైవర్లు : జీ.సైదులు, ఎం.హనుమయ్య, జీ.శ్రీశైలం, సీహెచ్. లక్ష్మయ్య

ఉత్తమ కండక్లర్లు : సీహెచ్.నర్సయ్య, పీ.సత్తయ్య, కే.నర్సింహా, కే.కవిత

ఉత్తమ మెకానిక్‌లు: జీ.రాజేందర్, ఎండీ.బద్రుద్దీన్

ఉత్తమ టైర్ మెకానిక్: ఎంఏ.రవూఫ్

ఉత్తమ శ్రామిక్/హెల్పర్: శివలింగం

ఉత్తమ అసిస్టెంట్ మేనేజర్లు(టీ): బీ.అశ్విని, ఆర్.సరితాదేవి, ఎన్.వెంకన్న, ఎం.హుస్సేన్

ఉత్తమ ఏఈ(ఎం): ఆర్.హనుమాన్, ఈ.అమల

ఉత్తమ సూపరింటెండెంట్: జేబీ.చార్యులు

డిపో మేనేజర్లు: ఎన్.ఇసాక్, బీ.పాల్, బీ.శ్రీనివాస్‌రావు

ఉత్తమ డిప్యూటీ ఆర్ఎం(ఓ): జీ.అపర్ణా కళ్యాణి

ఉత్తమ రీజినల్ మేనేజర్: సీహెచ్.వెంకన్న


First Published:  5 July 2023 7:11 AM IST
Next Story