Telugu Global
Telangana

రాహుల్ గాంధీతో క‌లిసి యాత్ర‌లో న‌డిచిన రోహిత్ వేముల త‌ల్లి రాధిక‌

భారత్ జోడో యాత్రలో 55వ రోజు మంగళవారం నాడు రోహిత్ త‌ల్లి రాధిక వేముల రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఆమె ఈ రోజు ఉదయం ఈ యాత్రలో ఆయ‌న‌తో క‌లిసి కొద్దిసేపు నడిచారు.

రాహుల్ గాంధీతో క‌లిసి యాత్ర‌లో న‌డిచిన రోహిత్ వేముల త‌ల్లి రాధిక‌
X

సామాజిక వివక్ష, అన్యాయంపై త‌న‌ పోరాటానికి రోహిత్ వేముల ప్రతీకగా నిలిచిపోతాడని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో 55వ రోజు మంగళవారం నాడు రోహిత్ త‌ల్లి రాధిక వేముల రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఆమె ఈ రోజు ఉదయం ఈ యాత్రలో ఆయ‌న‌తో క‌లిసి కొద్దిసేపు నడిచారు.

2016లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చ‌దువుకుంటున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల పై బిజెపి అనుబంధ విద్యార్ధి సంఘం ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు ఆయనతోపాటు మరో నలుగురిని వ‌ర్శిటీ యాజ‌మాన్యం సస్పెండ్ చేసింది. దళితుడు అనే కారణంతో యూనివర్సిటీ యాజమాన్యం త‌న ప‌ట్ల వివక్ష, వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ 2016లో 26 ఏళ్ల వేముల తన హాస్టల్ గదిలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే.

'భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలిపాను. రాహుల్ గాంధీతో కలిసి నడిచాన‌ని' వారి స‌మావేశం అనంతరం రాధిక వేముల ట్వీట్ చేశారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ శ్రేణుల‌కు కు పిలుపునిచ్చారు. రోహిత్ వేములకి న్యాయం జ‌ర‌గాలి. రోహిత్ చట్టం తేవాలి. దళితులకు, అణగారిన వర్గాలకు ఉన్నత న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం, అందరికీ విద్య క‌ల్పించాలి అంటూ రాధిక వేముల ట్వీట్ లో పేర్కొన్నారు.

రోహిత్ వేముల తల్లిని కలిసిన అనంతరం గాంధీ హిందీలో చేసిన ట్వీట్‌లో, "రోహిత్ వేముల ఎదుర్కొన్న‌టువంటి సామాజిక వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా నేను చేస్తున్న పోరాటానికి ప్రతీకగా మిగిలిపోతాడు" అని అన్నారు. రోహిత్ తల్లిని కలవడం ద్వారా, త‌న ప్రయాణ లక్ష్యం వైపు అడుగులు మరింత ధైర్యంగా పడతాయని, అలాగే మనస్సుకు ప్రశాంతత లభించిందని రాహుల్ పేర్కొన్నారు.

"షాద్‌నగర్‌లో, సివిల్ వాలంటీర్ల గ్రూప్ రాహుల్ ను క‌లిసి పాద యాత్ర‌లో పాల్గొన్నారు. మత సామరస్యం, శాంతి , ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి కాంగ్రెస్ ఆదర్శాలను ఈ గ్రూప్ స‌భ్యులు ప్ర‌చారం చేస్తుంటారు. అదేవిధంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, ప్రవాసీ మిత్ర కార్మిక సంఘం వంటి సంఘాల సభ్యులు, రైతు స్వరాజ్ వేదిక సభ్యులు, ప్రొఫెసర్ జి హరగోపాల్ వంటి విద్యావేత్తలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు' అని కాంగ్రెస్ నాయకుడు ఒక‌రు చెప్పారు.

First Published:  1 Nov 2022 3:46 PM GMT
Next Story