Telugu Global
Telangana

కూలీల ప్రాణాలు తీసిన బండరాయి.. కొత్త ఏడాది ముంగిట మృత్యువాత

మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలు జరగబోతున్నాయి, మరికొద్ది నిమిషాల్లోనే ఆటోలో ఉన్న కూలీలంతా వారి స్వస్థలాలకు చేరుకుంటారు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది.

కూలీల ప్రాణాలు తీసిన బండరాయి.. కొత్త ఏడాది ముంగిట మృత్యువాత
X

కొత్త ఏడాది సంబరాలు మరికొద్ది గంటల్లో మొదలు కాబోతున్నాయి. ఊరూవాడా అంతా సంబరాల్లో మునిగేందుకు రెడీ అవుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం మంగూరిగూడెంకి చెందిన కొంతమంది కూలీలు ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారు తిరిగొస్తున్నారు. ఇంతలోనే ఓ బండరాయి వారి ప్రాణాలు తీసింది. సరిగ్గా వారి ప్రాణాలు తీసేందుకే అన్నట్టుగా లారీలో నుంచి వచ్చి వారు ప్రయాణిస్తున్న ఆటోపై పడింది. ఆ రాయికిందపడి వారి శరీరాలు నుజ్జు నుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఐదుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.



లారీలో గ్రానైట్ రాళ్లను తరలించడం చూస్తూనే ఉంటాం. అలాంటి లారీలు సడన్ బ్రేక్ వేసినా, టర్నింగ్ ల వద్ద జాగ్రత్తగా లేకపోయినా ఆ బండరాళ్లు ఒరిగి కిందపడిపోతాయి. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. లారీ, ఆటో ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో చలన జడత్వంతో ఉన్న ఆ రాయి లారీ ఒక్కసారిగా ఆగిపోవడంతో దొర్లి కిందపడింది. అది ఆటోపై పడటంతో.. ఆ రాయి కింద కూలీల ప్రాణాలు నలిగిపోయాయి.

మరికొద్ది సేపట్లో..

మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలు జరగబోతున్నాయి, మరికొద్ది నిమిషాల్లోనే ఆటోలో ఉన్న కూలీలంతా వారి స్వస్థలాలకు చేరుకుంటారు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. కొత్త ఏడాది ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి, వారంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బండరాయి కింద ఉన్న మృతదేహాలను జేసీబీ సాయంతో పక్కకు తీస్తున్నారు.

First Published:  31 Dec 2022 9:15 PM IST
Next Story