రెవెన్యూలో పాత వాసనలు పక్కన పెట్టాలి
ప్రజలకు జవాబుదారీగా పని చేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాత వాసనలు పక్కన పెట్టి ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం రెవెన్యూ శాఖలోని ఆఫీసర్లు, ఉద్యోగ సంఘాల నాయకులతో సెక్రటేరియట్ లో ఆయన సమావేశమయ్యారు. ప్రజల్లో రెవెన్యూ వ్యవస్థపై పాజిటివ్ దృక్పథం కలిగించేలా పని చేయాలన్నారు. రానున్న రోజుల్లో రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. గజం భూమి కూడా కబ్జా కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ట్రాన్స్‌ఫర్ చేసిన తహశీల్దార్లను పాత స్థానాల్లో నియమించాలని, ప్రమోషన్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రికి విన్నవించారు. ఆఫీసుల అద్దె, వాహనాల అద్దె బకాయిలు త్వరగా విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఉద్యోగ సంఘాల నాయకులు లచ్చిరెడ్డి, రవీందర్ రెడ్డి, చంద్రమోహన్, శ్రీనివాస్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.