Telugu Global
Telangana

బీజేపీ గెలిస్తే జరిగేది ఇదే.. రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారన్నారు రేవంత్ రెడ్డి. దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.

బీజేపీ గెలిస్తే జరిగేది ఇదే.. రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు
X

గాంధీభవన్‌లో బీజేపీపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దే లక్ష్యంగా బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటే పార్లమెంట్‌లో 2/3వ వంతు మెజారిటీ సాధించాలన్నారు. అందుకే మోడీ పదేపదే 400 సీట్లలో గెలిపించాలని కోరుతున్నారని చెప్పారు. 2025కు RSS ఆవిర్భవించి వందేళ్లు పూర్తి కాబోతోంది కాబట్టి.. 2025లోగా రిజర్వేషన్స్ రద్దు చేయాలనే పట్టుదలతో బీజేపీ ఉందన్నారు. RSS, బీజేపీ పెద్దలు ఇప్పటికే పలుమార్లు రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మొండిగా వ్యవహరించి అయినా సరే రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ కుట్ర చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్‌ రద్దుకే..

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారన్నారు రేవంత్ రెడ్డి. దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే అన్నారు రేవంత్ రెడ్డి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైపు నిలబడొద్దన్నారు. రిజర్వేషన్లు వర్సెస్ రిజర్వేషన్లు రద్దుగా ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. బీజేపీకి ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు చేజేతులా తమ రిజర్వేషన్‌ పోగొట్టుకుంటారని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.

మోడీ చేసిన అప్పు రూ.113 లక్షల కోట్లు..

పదేళ్ల బీజేపీ వైఫల్యాలు, కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు రేవంత్ రెడ్డి. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ.. పదేళ్లలో కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న మోడీ.. పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. 2014 నుండి 2024 వరకు నరేంద్ర మోడీ ఒక్కడే చేసిన అప్పు అక్షరాల రూ. 113 లక్షల కోట్లన్నారు రేవంత్ రెడ్డి. 14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పు కంటే రెండింతల అప్పు పదేళ్లలోనే మోడీ చేశారన్నారు. ఈరోజు దేశం మీద రూ.168 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. దీంట్లో 14 మంది ప్రధానమంత్రులు 67 ఏళ్లలో 55 లక్షల కోట్లు అప్పు చేస్తే.. నరేంద్ర మోడీ ఒక్కడే రూ. 113 లక్షల కోట్లు అప్పు చేశారని వివరించారు రేవంత్ రెడ్డి.

First Published:  25 April 2024 3:07 PM IST
Next Story