Telugu Global
Telangana

రైతు భరోసా ఎగ్గొట్టినందుకు రేవంత్‌ ముక్కు నేలకు రాయాలి

మంత్రి తుమ్మల చావు కబురు చల్లగా చెప్పారు : మాజీ మంత్రి హరీశ్ రావు

రైతు భరోసా ఎగ్గొట్టినందుకు రేవంత్‌ ముక్కు నేలకు రాయాలి
X

ఖరీఫ్‌ సీజన్‌ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చావు కబురు చల్లగా చెప్పారని.. రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మాట ఇచ్చి ఎగ్గొట్టినందుకు రేవంత్‌ రెడ్డి ముక్కు నేలకు రాయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్‌ చేశారు. శనివారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఉంటాయి కానీ రైతులకు ఇచ్చేందుకు రూ.15 వేలు లేవా అని ప్రశ్నించారు. రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని, వడ్లకు క్వింటాల్‌ కు రూ.500 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని.. ఇప్పుడు రైతుబంధు విషయంలోనూ మోసం చేశారని మండిపడ్డారు. రైతులు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వదిలేది లేదని, కేసీఆర్ నాయకత్వంలో రైతుల తరుపున పోరాటం చేస్తామన్నారు.

రేవంత్ రెడ్డి తెచ్చిన జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. మెరిట్ సాధించిన వారికి ఓపెన్ కోటాలో కాకుండా, రిజ్వర్వుడు కోటాలో అవకాశం కల్పిస్తున్నారని, దీంతో రిజ్వర్వుడ్‌ కేటగిరి విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు. ఓపెన్ కోటా అంటే ఓపెన్ టు ఆల్ అనే విషయాన్ని మర్చిపోయారని అన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే.. ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నడని మండిపడ్డారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా జీవో 55 ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ వర్గానికి ప్రతినిధి అని.. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. యూపీఎస్సీ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తోందని, టీజీపీఎస్సీ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. జీవో 29తో ఓపెన్‌ కోటాలో రిజర్వుడ్‌ కేటగిరి వారికి అవకాశం లేకుండా చేశారని, అయినా అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల ఆర్తనాదాలు, ఆందోళనలతో అశోక్‌ నగర్‌ ప్రాంతం మార్మోగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై పోలీసులతో లాఠీచార్జీ చేయించి వీపులు పగల గొడుతున్నారని, ఆడపిల్లలను కూడా అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌ లో పెట్టడం దారుణమన్నారు.

అశోక్‌ నగర్‌ లోని సెంట్రల్‌ లైబ్రరీకి వచ్చి యువతకు హామీలిచ్చిన రాహుల్‌ గాంధీ.. ఇప్పుడు వారికి జరుగుతోన్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇంత అన్యాయం జరుగుతోన్న కాంగ్రెస్‌ పార్టీలోని బడుగు బలహీనవర్గాల ప్రతినిధులు నోరు విప్పడం లేదంటే ఆ పార్టీలో ప్రజస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన వాటిలో ఎంపికైన వారికి నియామకపత్రాలు ఇచ్చి అవి తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ బ్యాగ్‌ లాగ్‌ పోస్టుల భర్తీ, నిరుద్యోగ భృతి విషయంలోనూ మాట తప్పారన్నారు. యువత జీవితాలతో రేవంత్‌ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ పుస్తకాలు కాకుండా వికీపీడియాను ప్రమాణికంగా తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు చేయడం కాదు, వారిని పిలిచి మాట్లాడాలన్నారు. ఓట్లప్పుడు కాదు.. ఇప్పుడు అశోక్‌ నగర్‌ కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడాలన్నారు. రేవంత్‌ రెడ్డికి సెక్యూరిటీ లేకుండా అశోక్‌ నగర్‌ కు వెళ్లే దమ్ముందా అని సవాల్‌ విసిరారు. ఇంత జరుగుతున్నా నిరుద్యోగుల సమస్యే తన ఎజెండా అన్న కోదండరామ్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక గొంతు మూగబోయిందా అని ప్రశ్నించారు. రియాజ్, చింతపండు నవీన్, ఆకునూరి మురళీ అశోక్ నగర్ వెళ్లి విద్యార్థులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

First Published:  19 Oct 2024 1:55 PM IST
Next Story