Telugu Global
Telangana

హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతుబంధు ఆగింది - రేవంత్ రెడ్డి

రైతుబంధు అందజేసేందుకు ఈసీ అనుమతులు ఇచ్చినా హరీష్ రావు నోటి దురుసు వల్ల ఆగిపోయిందన్నారు. అల్లుడు హరీష్ రావు నిర్వాకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతుబంధు ఆగింది - రేవంత్ రెడ్డి
X

మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వల్లే రైతుబంధు నిధుల విడుద‌ల ఆగిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ డోర్నకల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి సభలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతుబంధు నిధుల విడుద‌ల ఆగిపోవడానికి కారణమైన హరీష్ రావు కనిపిస్తే లాగులో తొండలు విడిచి కొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులకు పిలుపునిచ్చారు. రైతుబంధు ముందుగానే అందజేయాలని తాము ఈసీని కోరామని, కానీ ఎన్నికలకు ముందు రైతుబంధు డబ్బు వేసి ఓట్లు దండుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం కేసీఆర్, హరీష్ రావులకు లేదన్నారు. రైతుబంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ కారణం అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, ఇది నిజం కాదని రేవంత్ రెడ్డి అన్నారు.

రైతుబంధు అందజేసేందుకు ఈసీ అనుమతులు ఇచ్చినా హరీష్ రావు నోటి దురుసు వల్ల ఆగిపోయిందన్నారు. అల్లుడు హరీష్ రావు నిర్వాకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుబంధు ఆగిపోవడానికి కారణమైన కేసీఆర్, హరీష్ రావును ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుబంధు పడలేదని రైతులు ఆందోళన చెందవద్దని, పది రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.15 వేల చొప్పున‌ రైతు భరోసా ఖాతాల్లో వేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

First Published:  27 Nov 2023 4:27 PM IST
Next Story