నన్ను డీల్ చేసుడు సంగతి తర్వాత.. ముందు కుర్చీ కాపాడుకో
రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్
తనను డీల్ చేయడం సంగతి తర్వాత కానీ ముందు రేవంత్ రెడ్డి తన సీఎం కుర్చీ కాపాడుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రేవంత్ ను ఎలా డీల్ చేయాలో తమకు తెలుసన్నారు. రేవంత్ మాటలు విని తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారోనని తల్లిదండ్రులు టీవీలు బంద్ పెడుతున్నారని.. రేవంత్ అబద్ధాలకు గోబెల్స్ కూడా సిగ్గు పడతారన్నారు. రేవంత్ మాటలపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. హైదరాబాద్ కు మూడు దిక్కులా సముద్రం ఉందని చెప్తాడని, కంప్యూటర్ రాజీవ్ గాంధీ కనిపెట్టాడని అంటున్నాడని, ఇవే మాటలు నిజమని నమ్మి వాటినే రేపు పరీక్షల్లో రాస్తే వాళ్ల పరిస్థితి ఏమిటన్నారు. రేవంత్ మాటలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయని అన్నారు. దిల్‌సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని రేవంత్ అన్నారని గుర్తు చేశారు.
మల్లన్నసాగర్ కోసం సేకరించిన భూమి 17,871 ఎకరాలైతే సీఎం రేవంత్ 50 వేల ఎకరాలు సేకరించారని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. సేకరించిన భూమిలో 3,280 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం కన్నా మెరుగైన ప్యాకేజీ ఇచ్చామన్నారు. 31 రకాల సాకులతో రేవంత్ రైతు రుణమాఫీని ఎగ్గొట్టారని తెలిపారు. కొడంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం అని, ఆగస్టు 15లోగా సంపూర్ణ రుణమాఫీ అని మాట ఇచ్చి రేవంత్ తప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేసుకోలేకపోయారని, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు కూడా భర్తీ చేసుకోలేని అశక్తత రేవంత్ ది అన్నారు. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసి రేవంత్ రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ తో పోల్చుకోవడం ఏమిటని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే రేవంత్ కు సీఎం పదవి ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్ కు సీఎం పదవి కేసీఆర్ భిక్ష అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్‌ఎస్ కు వంద సీట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ సీనియర్లు తన కుర్చీ గుంజుకోకుండా రేవంత్ చూసుకోవాలని సలహా ఇచ్చారు. త్వరలోనే తాము సీఎం అవుతామని కొందరు లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఒక మంత్రి వెళ్లి గవర్నర్ ను కలిస్తే ఇంకో మంత్రి హెలీ క్యాప్టర్ ఇవ్వలేదని అలిగాడని.. అది ప్రభుత్వంలోని పరిస్థితి అన్నారు.
మూసీ సమీపం పేదలను పేదలను వెళ్లగొట్టే ప్రయత్నాలకు మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి రూ.1,100 కోట్లతో మూసీకి నీటిని తరలించేందుకు కేసీఆర్ డీపీఆర్ తయారు చేయిస్తే.. మల్లన్న సాగర్ నుంచి రూ.7 వేల కోట్లతో నీటిని తరలించే పనులకు రేవంత్ పూనుకున్నారని, ఇది కమీషన్ల కోసం కాకుండా ఇకెందుకో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ న్యాయపోరాటంతో గచ్చిబౌలిలో 500 ఎకరాల భూమిని గెలుచుకున్నామని, ఆ భూమిని మూసీ బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ భూమిని అమ్మి రూ.10 వేల కోట్లు కొళ్లగొట్టే ప్రయత్నాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన దానికన్నా మెరుగైన పరిహారం మూసీ బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని కోరితే స్పెషల్ పోలీసులను సస్పెండ్ చేశారని తెలిపారు. తనకు రక్షణ కల్పించే పోలీసులపైనా రేవంత్ కు నమ్మకం లేదన్నారు. స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్ల సమస్యలు తెలుసుకునే తీరిక ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు.
బాపూఘాట్ లో భారీ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయించిన అంబేద్కర్ విగ్రహానికి సీఎం దండం పెట్టడం లేదు, ప్రజలు దర్శించుకునే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఎగవేతల రేవంత్ రెడ్డి అని తాను అన్నందుకు బేగంబజార్ పీఎస్ లో తనపై కేసు పెట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి తప్పిదాలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అయిందన్నారు. రేవంత్ కు ఫుట్ బాల్ ఒక్కటే వచ్చని.. తనకు క్రికెట్ మాత్రమే తెలుసన్నారు. ''ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... గోల్ కొట్టేది మేమే.. వికెట్ తీసేది మేమే.. ఈ లోపు హిట్ వికెట్ కాకుండా చూసుకో.. నీ మంత్రులే నిన్ను ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నరు.. మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్ తో పాదయాత్రకు నేను రెడీ.. రేపా? ఎల్లుండా ? టైం చెప్తే కేటీఆర్, నేను.. ఇద్దరం వస్తాం.. గన్ మెన్లు లేకుండా వస్తాం.. '' అన్నారు.
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమేనని.. అదే పది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.51,188 కోట్లు అన్నారు. ఈ ఏడాది జూలై నాటికే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.24,887 కోట్లు కాగా ఆ తర్వాత రూ.8 వేల కోట్లు తీసుకున్నారని తెలిపారు. మొత్తం కలిపి పది నెలల్లో రూ.85 వేల కోట్ల అప్పు చేశారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు బడ్జెటేతర అప్పుల లెక్కలు చెప్పలేదని సెప్టెంబర్ లోనే కాగ్ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తెచ్చిన అప్పులను ఎందుకు ఖర్చు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రేవంత్ బెదిరింపులకు ఎవరూ భయపడబోరన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ పై ఏసీబీ విచారణా మాత్రమే కాదు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు. కేటీఆర్ ప్రశ్నించే గొంతుక అని.. అక్రమ కేసులతో ఆయనను ఏమీ చేయలేరన్నారు.