Telugu Global
Telangana

పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ పాలన

జహీరాబాద్‌ లో ఫార్మాసిటీ ప్రయత్నాలు విరమించుకోవాలి : మాజీ మంత్రి హరీశ్‌ రావు

పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ పాలన
X

పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ రెడ్డి పాలన ఉందని.. ఆ రాయి ఇవ్వాల జహీరాబాద్‌ రైతుల నెత్తిన పడిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. న్యాల్కల్‌ లో ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ, ఫార్మా సిటీ ఏర్పాటుకు కేసీఆర్‌ హైదరాబాద్‌ సమీపంలో 15 వేల ఎకరాల భూ సేకరణ చేశారని.. జీరో పొల్యూషన్‌, జీరో వేస్టేజీ ఫార్మాసిటీకి పర్యావరణ, అటవీ శాఖలతో పాటు అన్ని అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌ కోసం తీసుకొని, ఫార్మాసిటీని జహీరాబాద్‌ కు తెస్తున్నారని అన్నారు. రేవంత్‌ నువ్వు ముఖ్యమంత్రివా.. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ వా అని ప్రశ్నించారు. న్యాల్కల్‌ లో మూడు పంటలు పండే భూముల్లో ఫార్మాసిటీ ఎందుకని ప్రశ్నించారు. మూసీ ఉద్దరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్న రేవంత్‌ ఇప్పుడు రైతుల ఉసురు పోసుకునేందుకు ఈ భూములపై పడ్డాడని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పేదరికాన్ని తగ్గించాలని ఇందిరమ్మ చూస్తే.. రైతులు, పేదోళ్లు లేకుండా చేయాలని రేవంత్‌ కుట్రలు చేస్తున్నారని అన్నారు. న్యాల్కల్‌ ప్రజలు ఫార్మాసిటీ వస్తుందనే ఆందోళనతో రెండు నెలలుగా అన్నం తినడం లేదన్నారు. వరంగల్‌ లో రైతు డిక్లరేషన్‌ పేరుతో ప్రభుత్వ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు గుంజుకుంటున్నావని మండిపడ్డారు.




రైతుల భూములను గుంజుకోవడానికి జేసీబీలు, ప్రొక్లెయిన్లు వస్తే తాము అడ్డుగా నిలుస్తామన్నారు. అవి తమపై నుంచే రైతుల వద్దకు రావాలన్నారు. ఫార్మా సిటీకి వ్యతిరేకంగా గ్రీన్‌ ట్రిబ్యునల్‌, హైకోర్టుల్లో కేసులు దాఖలు చేస్తామని.. రైతుల భూములు పోకుండా కాపాడుతామన్నారు. రైతులందరూ ఒక్క మాట మీద ఉండాలన్నారు. న్యాల్కల్‌ కోహీర్ జామకాయలు, డపూరు పుదీనా కు ఫేమస్ అని.. ఇక్కడ ఫార్మాసిటీ పెడుతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఫార్మాసిటీ పెడితే రంగారెడ్డి జిల్లాలో సేకరించిన భూముల్లోనే పెట్టాలన్నారు. మూసీని శుద్ధి చేస్తానని చెప్తోన్న రేవంత్‌ రెడ్డి మంజీరాను కరాబు చేయాలని ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. ఫార్మా సిటీ వస్తే ఇక్కడి వనరులు కలుషితం అవుతాయన్నారు. పాలలాంటి మంజీరా నీళ్లల్లో విషపు చుక్కలు కలుపుతావా అని ప్రశ్నించారు. చీకట్లో సంతకాలు పెట్టిస్తారు రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాళ్లు, రప్పలు ఉండే భూముల్లోనే ఫ్యాక్టరీలు పెట్టాలే తప్ప పంటలు పండే భూముల్లో కాదన్నారు. రైతులకు అండగా తాను, ఎమ్మెల్యే మాణిక్‌ రావు ఇక్కడే ఉంటామన్నారు. అసెంబ్లీలో రైతుల కోసం కొట్లాడుతామన్నారు. ఈ భూములు మీ బిడ్డలకు దక్కాలే తప్ప గద్దలా రేవంత్‌ తన్నుకుపోతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులతో గోదావరి నీళ్లు ఇవ్వాలని తలపెడితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆపేశారన్నారు. ఆందోళనలో ఎమ్మెల్యేలు మాణిక్‌ రావు, చింత ప్రభాకర్‌, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

First Published:  3 Oct 2024 5:31 PM IST
Next Story