Telugu Global
Telangana

మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే రేవంత్‌ ఢిల్లీ టూర్‌

రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి గాలిమోటార్‌ ఎక్కుతున్న సీఎం : కేటీఆర్‌

మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే రేవంత్‌ ఢిల్లీ టూర్‌
X

మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే సీఎం హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. పేదల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన భాసులతో మంతనాలు చేస్తున్నారని ఆరోపంచారు. సీఎం ఢిల్లీ పర్యటనలతో రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగురిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పది నెలల్లో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రాష్ట్ర ప్రజల కోసం సాధించింది ఏమిటో చెప్పాలన్నారు. ఢిల్లీకి పోయి వచ్చేందుకు కనీసం ఫ్లైట్‌ చార్జీలతో సమానమైన నిధులైనా తీసుకువచ్చారా అని నిలదీశారు. ఎక్కువ సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చిన సీఎంగా రికార్డు సృష్టించే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలు ప్రజల కోసమా లేదంటే, కాంగ్రెస్‌ అధిష్టానాన్ని మెప్పించడానికా చెప్పాలన్నారు. మూసీలో రూ.వేల కోట్లు ఎలా కొళ్లగొట్టొచ్చో పెద్దలకు చెప్పడానికే ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. పది నెలల్లోనే సీఎం 23 సార్లు ఢిల్లీకి వెళ్లారంటే.. ఐదేళ్లలో 125 సార్లు వెళ్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు పాలించమని అధికారం ఇస్తే ఢిల్లీకి వెళ్లి గులాం గిరీ చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికే ఢిల్లీకి వెళ్తున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎంత మంది కేంద్రం పెద్దలను ఎన్నిసార్లు కలిశారు.. రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని మోదీని బడే భాయ్‌ అన్న రేవంత్‌ రెడ్డి.. ఆయనను ఒప్పించి రాష్ట్రానికి తెచ్చిన నిధులేమిటో చెప్పాలన్నారు. కేంద్ర బడ్జెట్‌ లో, వరద సాయంలో తెలంగాణకు కేంద్ర అన్యాయం చేసినా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఎందుకు నిలదీయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తన వ్యవహారశైలితో ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురైన రేవంత్‌ రెడ్డి డబ్బుల మూటలతో చల్ల బరిచే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల సొమ్ముతో పార్టీ హైకమాండ్ పెద్దలను కలిసేందుకు వెళ్లి.. కేంద్ర మంత్రులను కలుస్తున్నామనే ముసుగు వేసుకుంటున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ ప్రజలకు కూడా తెలుసన్నారు. పాలనను గాలికి వదిలేసి రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొట్టడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా సీఎం ఢిల్లీ పర్యటనలు బంద్‌ పెట్టి ప్రజలకు మంచి చేసే పనులపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టుపెట్టడం మాని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నించాలని సూచించారు.

First Published:  7 Oct 2024 3:35 PM GMT
Next Story