Telugu Global
Telangana

ఇష్టానుసారం మాట్లాడితే రేవంత్ రెడ్డి నాలుక కోస్తం : బీఆర్ఎస్ నాయకులు

మాజీ మేయర్, బీఆర్ఎస్ నాయకుడు బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు.

ఇష్టానుసారం మాట్లాడితే రేవంత్ రెడ్డి నాలుక కోస్తం : బీఆర్ఎస్ నాయకులు
X

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ఇష్టానుసారం మాట్లాడితే నాలుక చీరేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిని పరిశీలించడానికి వచ్చిన రేవంత్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కారిడార్ పనులను నత్తనడకన సాగిస్తూ.. ఉప్పల్ ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న వారిద్దరికీ పిండం పెడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.

మాజీ మేయర్, బీఆర్ఎస్ నాయకుడు బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. పిస్తా హౌస్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు దిష్టిబొమ్మను ఊరేగించి.. అనంతరం దగ్దం చేశారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొని వచ్చిన కేసీఆర్ గురించి ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు.

మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ అభివృద్దిలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఉప్పల్ ఎలివేటెడ్ హైవే అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ హైవే అథారిటీస్ నిర్మిస్తున్నదన్న విషయం కూడా ఎంపీ రేవంత్ రెడ్డికి తెలియక పోవడం శోచనీయం అన్నారు. నేషనల్ హైవేస్ పనులతో సంబంధం లేకపోయినా.. ఉప్పల్ ప్రజల కష్టాలను తీర్చడానికి రూ.150 కోట్లు కేటాయించి నారపల్లి వరకు రోడ్డు వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతిని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పి మల్కాజిగిరి ప్రాంత ప్రజల ఓట్లు వేయించుకొని పార్లమెంటులో అడుగు పెట్టిన రేవంత్ రెడ్డి.. నాలుగేళ్లుగా ఇటువైపు చూడటం లేదని బొంతు రామ్మోహన్ విమర్శించారు. వరదల సమయంలో ఏనాడూ ఇటువైపు ముఖం చూపెట్టని వ్యక్తి.. ఇవ్వాళ వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై అసంబద్ద ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

First Published:  30 July 2023 4:04 PM IST
Next Story