Telugu Global
Telangana

సీఎం హోదాలో రేవంత్‌ ఫస్ట్ ఫారిన్‌ టూర్‌.. ఎక్కడికంటే.?

ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన.. సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమై.. వారి నుంచి తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆహ్వానించనున్నారు.

సీఎం హోదాలో రేవంత్‌ ఫస్ట్ ఫారిన్‌ టూర్‌.. ఎక్కడికంటే.?
X

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది. జనవరి నెలలో స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో ఆయనకిదే తొలి విదేశీ పర్యటన. జనవరి 15-19 తేదీల మధ్య స్విట్జర్లాండ్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు దావోస్‌ వెళ్లనున్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. తెలంగాణ, మరీ ప్రత్యేకంగా హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రయోజనాల గురించి ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం వివరించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన.. సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమై.. వారి నుంచి తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆహ్వానించనున్నారు.

బీఆర్ఎస్ హయాంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్, అధికారులు పలుసార్లు దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ప్రముఖ సంస్థలను హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో వందకుపైగా దేశాల నుంచి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి 5 రోజులపాటు ఫ్రమ్ ల్యాబ్ టు లైఫ్సైన్స్ ఇన్‌యాక్షన్ పేరుతో సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇండియా నుంచి కేంద్రమంత్రులతో వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

First Published:  29 Dec 2023 10:42 AM GMT
Next Story