Telugu Global
Telangana

రిస్క్ వద్దనుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి సారధ్యంలోనే లోక్ సభ ఎన్నికలు

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల టికెట్ల కోసం 187 మంది నేతల పేర్లతో జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు పీసీసీకి ప్రతిపాదనలు పంపాయి. ఎంపీ టికెట్లు ఆశించే కాంగ్రెస్‌ నేతలు ఫిబ్రవరి 3లోగా పీసీసీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

రిస్క్ వద్దనుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి సారధ్యంలోనే లోక్ సభ ఎన్నికలు
X

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్, ఆ సెంటిమెంట్ ని లోక్ సభ ఎన్నికల వరకు కంటిన్యూ చేసేలా ఉంది. ఓవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న రేవంత్ రెడ్డి.. లోక్ సభ ఎన్నికల వరకు పార్టీ చీఫ్ గానే వ్యవహరించే అవకాశముంది. రేవంత్ సీఎం అయ్యాక పీసీసీ మార్పుపై ఊహాగానాలు వినిపించినా చాలామంది తమకు తామే పోటీ దారులుగా ప్రకటించుకున్నా.. అధిష్టానం మాత్రం రిస్క్ తీసుకోవట్లేదు. రేవంత్ ని ముందు పెట్టి తెలంగాణలో లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోడానికి సిద్ధమైంది పార్టీ.

ఆశావహులనుంచి అప్లికేషన్లు..

అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ లో అప్లికేషన్ల హడావిడి జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి కూడా టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల టికెట్ల కోసం 187 మంది నేతల పేర్లతో జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు పీసీసీకి ప్రతిపాదనలు పంపాయి. వీరితో పాటు ఇంకా ఎవరైనా బలమైన నేతలుంటే అప్లికేషన్లు పెట్టుకోవాలని సూచించారు కాంగ్రెస్ పెద్దలు. ఎంపీ టికెట్లు ఆశించే కాంగ్రెస్‌ నేతలు ఫిబ్రవరి 3లోగా పీసీసీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

అధిష్టానానికే ఎంపిక బాధ్యత..

అభ్యర్థుల ఎంపికను పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక కమిటీకి హరీశ్‌ చౌదరి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో జాబితా తయారు చేసి ఏఐసీసీకి పంపుతుంది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ టికెట్లకు విపరీతమైన పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పటికే కొందరు సీనియర్లు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. మరి వారి మాట చెల్లుబాటవుతుందా, కొత్త నేతలకు అధిష్టానం అవకాశమిస్తుందా..? వేచి చూడాలి.

First Published:  31 Jan 2024 1:51 AM GMT
Next Story