కేసీఆర్‌ను ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి.. ఆశ నెరవేరేనా!
కేసీఆర్ బాటలోనే రేవంత్ సైతం నడుస్తున్నారు. కొడంగల్‌లోని తన నివాసంలో మూడు రోజులు చండీయాగం నిర్వహించారు. ఈ యాగంలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు రేవంత్ రెడ్డి.
గులాబీ బాస్ కేసీఆర్‌ను ట్రెండ్ సెట్టర్‌గా అభివర్ణిస్తుంటారు ఆ పార్టీ కార్యకర్తలు. పథకాల విషయంలోనైనా, మరే విషయంలోనైనా కేసీఆర్ నిర్ణయాలు అలా ఉంటాయని చెప్తుంటారు. ఎప్పుడూ తనదైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే కేసీఆర్‌కు దైవారాధన కాస్త ఎక్కువే. కీలక సమయాల్లో చండీయాగం, రాజశ్యామల యాగం, అతిరుద్ర యాగం అంటూ యాగాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఆయనపై ప్రతిపక్ష నేతలు విమర్శలు కూడా చేస్తారు. అయితే ఆయనపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.. ఏదో ఓ సమయంలో కేసీఆర్‌ను ఫాలో అవుతూనే ఉంటారు విపక్ష నేతలు. తాజాగా అదే జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా..!
కేసీఆర్ బాటలోనే రేవంత్ సైతం నడుస్తున్నారు. కొడంగల్‌లోని తన నివాసంలో మూడు రోజులు చండీయాగం నిర్వహించారు. ఈ యాగంలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. తన కూతురు, అల్లుడితో కలిసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణలో ప్రజారంజకమైన పాలన రావాలని కోరుకున్నట్టు చెప్పుకొచ్చారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని.. భవిష్యత్తులో కూడా ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకున్నారు రేవంత్ రెడ్డి.
అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేవంత్ రెడ్డి తన నివాసంలో చండీయాగం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సైతం గత ఎన్నికల ముందు యాగం నిర్వహించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ గెలవాలనే చండీయాగం నిర్వహించారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరీ రేవంత్ ఆశ నెరవేరుతుందా.. లేదా అనేది కాలమే నిర్ణయించాలి.