Telugu Global
Telangana

కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ.. రేవంత్ రెడ్డి క్లారిటీ..

మీరు సీఎం అవుతారా, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి మీరేనా అనే ప్రశ్నకు మాత్రం రేవంత్ రెడ్డి సమాధానం దాటవేశారు. తాను రాజకీయాల్లో చాలా క్లారిటీతో ఉన్నానని, సీఎం పదవి విషయంలో కూడా తనకు క్లారిటీ ఉందని చెప్పారు.

కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ.. రేవంత్ రెడ్డి క్లారిటీ..
X

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరగాల్సిన ఎన్నికల్లో ఆయన శాసన సభకు పోటీ చేస్తారనే ఊహాగానాలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఎంపీగా ఆయనకు మరో ఏడాది పదవీకాలం ఉండగానే, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా అనేదానిపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం హాథ్ సే హాథ్ జోడో యాత్రలో పాల్గొంటున్న రేవంత్ రెడ్డి.. తన భవిష్యత్ ప్రణాళికను స్పష్టం చేశారు. కొడంగల్ నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు.

పోయిన చోటే వెదుక్కుంటా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పిన రేవంత్ రెడ్డి.. పోయిన చోటే వెదుక్కుంటానంటూ క్లారిటీ ఇచ్చారు. గతంలో తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంలో ఎంపీగా గెలిచారు. మల్కాజ్ గిరిలో తన సొంత చరిష్మాతోనే గెలిచానన్న ఆయన, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కొడంగల్ నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

రెండుచోట్లా కాంగ్రెస్సే..

2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆ మరుసటి ఏడాది కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు 150 లోక్ సభ స్థానాలు వస్తాయని, మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో తమ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమువుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో 3సార్లు వరుసగా ఏ పార్టీకి ప్రజలు అధికారం ఇవ్వలేదని, ఈసారి కూడా అదే సెంటిమెంట్ కొనసాగుతుందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీకి తెలంగాణలో అంత బలం లేదని, కచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడతారన్నారు రేవంత్ రెడ్డి.

మీరు సీఎం అవుతారా, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి మీరేనా అనే ప్రశ్నకు మాత్రం రేవంత్ రెడ్డి సమాధానం దాటవేశారు. తాను రాజకీయాల్లో చాలా క్లారిటీతో ఉన్నానని, సీఎం పదవి విషయంలో కూడా తనకు క్లారిటీ ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర లాగే, తెలంగాణలో హాథ్ సే హాథ్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు రేవంత్ రెడ్డి. తాము అభ్యర్థుల మీద సర్వే చేయటం లేదని, ప్రజల మనసులో ఏముందనే దానిపై సర్వే చేస్తున్నామని చెప్పారు.

First Published:  16 March 2023 7:42 PM IST
Next Story