Telugu Global
Telangana

కామారెడ్డిలో పోటీకి సై అంటున్న రేవంత్ రెడ్డి..

కేసీఆర్ బరిలో దిగుతున్న రెండు నియోజకవర్గాలు.. గజ్వేల్, కామారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ నేతలు వెనకడుగు వేస్తున్నారు. పిలిచి టికెట్ ఇచ్చినా ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రం సాహసం చేయలేమంటున్నారు.

కామారెడ్డిలో పోటీకి సై అంటున్న రేవంత్ రెడ్డి..
X

సీఎం కేసీఆర్ పై పోటీ అంటే మాటలు కాదు. ఆయనపై పోటీ చేస్తే పేరొస్తుంది కానీ డిపాజిట్ రాదనే ప్రచారం ఉంది. అందుకే బీఆర్ఎస్ ని ఓడిస్తామని చెప్పుకుంటున్న నాయకులు కూడా కేసీఆర్ పోటీ చేసే నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడరు. ఈటల రాజేందర్ గజ్వేల్ లో పోటీ చేయడానికి ముందుకొచ్చినా, సేఫ్ సైడ్ తన నియోజకవర్గం హుజూరాబాద్ లో కూడా పోటీ చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై పోటీకి సై అంటున్నారు. కామారెడ్డిలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారట. ఆల్రడీ కొడంగల్ లో పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ పై పోటీకి సై అంటున్నారు. అధిష్టానం ఆదేశిస్తే బరిలో దిగుతానంటున్నారు.

కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. నేనే పోటీ చేస్తాంటూ ఆయన చెబుతున్నా.. ఎక్కడో ఆయనకు మనసు ఒప్పుకోవడంలేదు. అటు బీజేపీ, గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ ను పోటీకి పెట్టి తమ సత్తా చూపిస్తామంటోంది. ఈ దశలో కాంగ్రెస్ వెనకడుగు వేయడం ఎందుకనుకున్నారో ఏమో.. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి బరిలో దిగుతానంటున్నారు. అయితే అధిష్టానం ఆదేశం అంటూ ఆయన మెలిక పెట్టడం విశేషం.

కాంగ్రెస్ ఆ ప్రయోగం చేస్తుందా..?

ఇప్పటికే కాంగ్రెస్ లో టికెట్ల పోరు ఎక్కువగా ఉంది. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరేసి పోటీలో ఉన్నారు. అయితే కేసీఆర్ బరిలో దిగుతున్న రెండు నియోజకవర్గాలు.. గజ్వేల్, కామారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ నేతలు వెనకడుగు వేస్తున్నారు. పిలిచి టికెట్ ఇచ్చినా ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రం సాహసం చేయలేమంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఎలాగూ కొడంగల్ ఉండనే ఉంది. అదనంగా కామారెడ్డిలో బరిలో దిగితే కేసీఆర్ పై పోటీ చేశారన్న పేరు వస్తుంది. అందుకే రేవంత్ కొత్త పల్లవి అందుకున్నారు.

First Published:  26 Oct 2023 3:41 PM IST
Next Story